ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు: ఇతర న్యాయస్థానాలకూ..!!
అమరావతి: ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు రాబోతోన్నారు. ఈ మేరకు వారి పేర్లను దేశ అత్యున్నత న్యాయస్థానం ఎంపిక చేసింది. ఈ నలుగురి పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ జాబితాను ఆమోదించాల్సి ఉంది.
ఈ నలుగురూ సీనియర్ అడ్వొకేట్లు. వారికి న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది సుప్రీంకోర్టు. ఇందులో- హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ అలియాస్ కిరణ్మయి కనపర్తి, సుమతి జగడం, న్యాయపతి విజయ్ ఉన్నారు. వారి సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి ఇచ్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం ఈ మేరకు ఈ నలుగురి పదోన్నతికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. ఇందులో హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం పేర్లను కొలీజియం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. న్యాయపతి విజయ్ విషయంలో ఒక సభ్యుడు తన అభిప్రాయాలను వెల్లడించలేదు.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యాన్ని వహించిన ఈ ఈ కొలీజియంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. కాగా- జ్యుడీషియల్ ఆఫీసర్లు అభయ్ నారాయణ్‌జీ మంత్రి, శ్యామ్ ఛగన్‌లాల్ చందక్, నీరజ్ ప్రదీప్ ధోతెలను బోంబే హైకోర్టు న్యాయమూర్తులుగా రెకమెండ్ చేసింది.
మరో ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు శైలేందర్ కౌర్, రవీందర్ దుదేజా ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. జ్యుడీషియల్ అధికారి వినయ్ కన్నయ్య లాల్‌ను గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఆయా ప్రతిపాదనలన్నింటినీ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది.












Click it and Unblock the Notifications