జగన్ సర్కారుకు నిమ్మగడ్డ మరో షాక్- చర్యలు కోరుతూ హైకోర్టులో ధిక్కార పిటిషన్
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుకూ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కూ మధ్య సాగుతున్న యుద్ధం పతాక స్ధాయికి చేరుకుంది. ఏపీలో కరోనా ప్రభావం తగ్గినందున ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ భావిస్తుండగా.. వ్యాక్సిన్ పంపిణీ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఏఫీలో స్ధానిక సంస్దల ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత కలకలం రేపుతోంది.

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఏర్పాట్లలో పాలుపంచుకోవాలని అధికారులకు ఎన్నికల సంఘం లేఖలు రాస్తోంది. అయితే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రాస్తున్న లేఖలకు ప్రభుత్వం స్పందించడం లేదు. అలాగే అధికారుల కూడా ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం లేదు. దీంతో నిమ్మగడ్డ రమేష్ చేసేది లేక హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేలా తగు ఆదేశాలు ఇవ్వాలని నిమ్మగడ్డ హైకోర్టును కోరారు.












Click it and Unblock the Notifications