వైసీపీలోకి మరో సీనియర్ ఐఏఎస్ - అదే బాటలో మరి కొందరు..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ లు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. వైసీపీకి 2019 ఎన్నికల సమయంలో పదవీ విరమణ చేసిన ఐఏఎస్ లు సేవలు అందించారు. ఇప్పుడు మరికొందరు ఆ జాబితాలో చేరుతున్నారు. తాజాగా ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరి కొందరు పదవీ విరమణ చేసిన అధికారుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
వైసీపీలోకి ఐఏఎస్ లు
సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ 1989 బ్యాచ్ అధికారి. ఏపీ ప్రభుత్వంలో అనేక కీలక శాఖల బాధ్యతలను పర్యవేక్షించారు. చంద్రబాబు హాయంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జగన్ ప్రభుత్వంలో కీలకమైన పరిశ్రమల శాఖ బాధ్యతలను చూసారు. కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

కరికాల వలవన్ రేపు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన మరో ఏడాది కాలం కొనసాగనున్నారు. ఈ హోదాలో టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగానూ వ్యవహరిస్తారు.
ఎన్నికల్లో పోటీకి సిద్దం
తమిళనాడు రాష్ట్రానికి చెందిన కరికాల వలవన్ ఏపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇస్తే తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తిరుపతి సీటు నుంచి ప్రస్తుతం డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
ఇప్పటికే జగన్ తరఫున ప్రచారం చేసేందుకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ జనంలోకి వెళ్తున్నారు. ఆయన కూడా వైసీపీ తరఫున బరిలో దిగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తడ నుంచి తుని వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ కుమార్ వైసీపీ బాపట్ల ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అక్కడ నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.

మరి కొందరు అదే బాటలో
2019 ఎన్నికల సమయంలో అజయ్ కల్లం, శామ్యూల్ వంటి అధికారులు సీఎం జగన్ కు మద్దతుగా పని చేసారు. ప్రస్తుతం అజయ్ కల్లం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల సమయంలో పలువురు ఐఏఎస్ లు వైసీపీ, టీడీపీ నుంచి పోటీకి ముందుకు వస్తున్నారు. అటు బీఆర్ఎస్ లోనూ సివిల్స్ అధికారులు ఏపీ నుంచి పని చేస్తున్నారు.
బీజేపీ నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో పని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేసారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్ సైతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం మరో ఇద్దరు ఐపీఎస్ అధికారుల పేర్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో ఉన్నాయి. దీంతో, రానున్న ఎన్నికల్లో సివిల్స్ అధికారులకు సీట్లు.. బరిలోకి దిగితే ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications