ఏపీ ఎస్సై నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు-స్టే ఎత్తివేతకు నో...
ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న లోపాల విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. 45 వేల మంది నిరుద్యోగ యువతతో ముడిపడిన అంశం కావడంతో దీనిపై సింగిల్ బెంచ్ స్టే ఎత్తేయాలని ప్రభుత్వం కోరింది. అయితే హైకోర్టు మాత్రం స్టే ఎత్తేసేందుకు నిరాకరించింది. దీంతో పాటు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గతంలో జరిగిన ఎస్సై రిక్రూట్ మెంట్లో అభ్యర్ధులు తమకు ఎత్తు విషయంలో అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ రిక్రూట్ మెంట్ పై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీన్ని ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. స్టే ఎత్తేసేందుకు నిరాకరించింది. అంతే కాదు హైకోర్టు దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని, ఇందులో అభ్యర్ధుల ఎత్తును తిరిగి కొలుస్తామని కూడా తెలిపింది.

ఇవాళ విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు గతంలో అభ్యర్ధులకు ఎత్తు కొలిచిన వీడియోను కూడా అందజేశారు. దీన్ని పరిశీలించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఎత్తేయాలని కోరారు. కానీ డివిజన్ బెంచ్ మాత్రం ససేమిరా అంది. దీంతో పాటు ఎత్తుకు సంబంధించి అభ్యర్ధులు నకిలీ ఆరోపణలు చేసినట్లు తేలితే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం ఈ నెల 29కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications