AP Election: జనసేనకు షాక్ -రెబెల్స్, ఇండిపెండెంట్లకు గాజు గ్లాసులు..!
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీకి షాక్ తప్పేలా లేదు. తమకు గతంలో కేటాయించిన గాజు గ్లాసు గుర్తును తాము ఈసారి పోటీ చేయని స్ధానాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు, ఇతర చిన్నా చితకా పార్టీలకు కేటాయించవద్దంటూ ఈసీని అభ్యర్ధించింది. అయితే ఈసీ నుంచి ఈ మేరకు ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తోంది.
జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన రెబెల్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సూర్యచంద్రకు ఈసీ ఇవాళ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. నిబంధనల ప్రకారమే తాము సూర్యచంద్రకు గాజుగ్లాస్ కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉన్నారు. అలాగే విజయవాడ ఎంపీ సీటులో నవతరం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన యనమండ్ర కృష్ణ కిషోర్ కు సైతం గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు తెలుస్తోంది.

అలాగే విజయనగరం అసెంబ్లీ స్ధానంలో కూటమి అభ్యర్ధి ఆదితి గజపతిరాజుకు పోటీగా బరిలోకి దిగిన టీడీపీ రెబెల్ మీసాల గీత సైతం ఇవాళ నామినేషన్ ఉపసంహరించుకోకపోవడం, ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాగే మరికొన్ని సీట్లలో రెబెల్స్, ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తమకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తును ఇతర అభ్యర్ధులకు, పార్టీలకు ఇవ్వొద్దని కోరినా పట్టించుకోకపోవడంపై కూటమి నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications