Amara Raja : అమరరాజా బ్యాటరీస్ కు సుప్రీంకోర్టు షాక్- ఏపీ పీసీబీకి కీలక ఆదేశాలు..
ఏపీలో కాలుష్యం వెదజల్లుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అమరరాజా బ్యాటరీస్ సంస్ధకు సుప్రీంకోర్టు ఇవాళ గట్టి షాక్ ఇచ్చింది.
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్ధకు సుప్రీంకోర్టులో ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమరరాజా బ్యాటరీస్ నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
అమరరాజా బ్యాటరీస్ సంస్ధ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరరాజా సంస్ధకు గతంలో స్టే మంజూరు చేసింది.అయితే తాజా విచారణలో సుప్రీంకోర్టు ఆ స్టేను ఎత్తేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అంతే కాదు పీసీబీ తగు విచారణ జరిపి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

అమరరాజా బ్యాటరీస్ సంస్దకు గతంలో పీసీబీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టుకు.. రాజకీయ కారణాలతో తమకు 34 నోటీసులు జారీ చేసినట్లు సంస్ధ తెలిపింది. అయితే రాజకీయ కారణాలు ఏవైనా నిబందనల ప్రకారం చట్ట ప్రకారం ముందుకు పోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications