అమరావతిలో వరద ప్రవాహం- విజయవాడకు రాకపోకలు బంద్
Heavy rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడనుంది. క్రమంగా ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ఫలితంగా- నేడు, రేపు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల ప్రభావం వల్ల కృష్ణా నదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం మొదటి హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా- నదీ పరీవాహక, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.
గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. ఈదురు గాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగుల కింద నిల్చోకూడదని, అవి కూలిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
భారీ వర్షాల ధాటికి రాజధాని అమరావతి పరిధిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైనా వరద నీటి ప్రవాహం పోటెత్తింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భారీ వర్షాల వల్ల కొండవీటి వాగు ఉప్పొంగింది. అమరావతి-గుంటూరు రహదారిపై ఉద్ధృతంగా ప్రవహించడంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ నుంచి భారీగా చేరిన వరద నీటి ప్రవాహం వల్ల పంట పొలాలు మునిగిపోయాయి. అమరావతి మండలం పెద్ద మద్దూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపైకి నీరు చేరడంతో అమరావతి-విజయవాడ రహదారి రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
రాత్రి పడిన వర్షానికి అటు విజయవాడలో లోతట్టు ప్రాంతలు జలమయం అయ్యాయి. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలో వరద నీటి ప్రవాహం అధికంగా కనిపించింది. విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో భారీగా వర్షపునీరు చేరుకోవడంతో రోజువారీ కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications