ఏపీని తుఫాన్ ముంచెత్తనుందా? క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ!!
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమమధ్య- దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడుతుందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం మధ్యాహ్నం ఒడిశా దక్షిణ ప్రాంతం- ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య తీరాన్ని దాటుతుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేసింది. కాగా ఈ వాయుగుండానికి తోడు మరొక అల్పపీడనం జత అయ్యే అవకాశాలు లేకపోలేదని విపత్తు నిర్వహణ సంస్థ అభిప్రాయపడింది.
సోమవారం నాటికి వాయవ్య బంగాళాఖాతం- దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావం ఏపీ, ఒడిశాపై అధికంగా ఉంటుందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీవర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
మరోవంక- విశాఖపట్నంలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీని ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జిల వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. విశాఖపట్నం రోడ్లన్నీ చిన్నపాటి నదులను తలపిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications