ఓరయ్యా.. తెలుగు, తమిళ సినిమాలన్నీ మిక్సీలో ఏసి రుబ్బాడే
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజా చిత్రం జవాన్. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళ పరిశ్రమకు చెందిన అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. రాజారాణి తర్వాత విజయ్ తో వరుసగా మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అనంతరం షారుక్ ఖాన్ ను డైరెక్ట్ చేశాడు. ఉత్తరాది ప్రేక్షకులకు ఈ చిత్రం మసాలా దినుసులు ఏసి ఎక్కువ తక్కువ కాకుండా సమపాళ్లలో వండిన వేడివేడి బిర్యానీలా ఉంది. దక్షిణాది ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా చూస్తున్నంతసేపు గతంలో ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాలే గుర్తుకొచ్చాయి.
కార్పొరేట్ కంపెనీలు రూ.కోట్లకు రూ.కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొడుతుంటే వారిని ఏమీ అనకుండా ట్రాక్టర్ కిస్తీ కట్టలేని రైతు ఇంటిపై డేగల్లా వాలి చిత్రవధకు గురిచేసే సన్నివేశం చూడగానే మహేష్ బాబు హీరోగా నటించి సర్కారువారి పాట సినిమానే గుర్తుకొచ్చింది. కమిషన్ల కోసం కక్కుర్తిపడే ప్రభుత్వ పెద్దల నిర్వాకం వల్ల ప్రభుత్వాస్పత్రులకు సమకూరలేని వసతులవల్ల ఎంత నష్టపోతున్నారనేది వెంకటేష్ హీరోగా వచ్చిన గణేష్, చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమాలే జ్ఞాపకానికి వచ్చాయి.

సర్కారువారిపాట, గణేష్, ఠాగూర్, భారతీయుడు, బొబ్బిలిపులి, విక్రమార్కుడు, భాషా ఆరంభం సినిమాల్లో హైలైట్ అయిన సీన్లన్నీ జవాన్ లో అట్లీ వాడుకున్నాడు. ఒకటి లేదంటే రెండు సన్నివేశాలు ఆయా సినిమాల్లో బాగా హైలైటయ్యాయి. వాటన్నింటినీ ఒకేసారి చూపించడంవల్ల ఉత్తరాది ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతున్నారు.అంతేకాకుండా షారుక్ అన్నిరకాల గెటప్స్ వేయడంతోపాటు పాటలు, డాన్స్ లు అన్నీ దక్షిణాది సినిమాల్లో అనుసరించే ఫార్ములానే అట్లీ అనుసరించాడు. సినిమాలో హీరో మొదటి ఇంట్రడక్షన్ సీన్ నుంచి మెట్రో రైల్ ఎపిసోడ్ వరకు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చూసుకున్నాడు. కథ కొత్తగా లేకపోయినప్పటికీ దానిని ప్రజెంట్ చేసే విధానంలో అట్లీ విజయవంతమయ్యాడు. అంతేకాదు.. ఉప్పు, కారం ఎక్కువ కాకుండా, మసాలా కూడా సమపాళ్లల్లో ఉండేలా చూసుకొని దాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ప్రేక్షకులందరికీ వడ్డించాడు.












Click it and Unblock the Notifications