రిజైన్లకు ఆరుగురు ఎంపీలు సిద్ధం: తిరగబడాలని ప్రసాద్
హైదరాబాద్: ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలను ఆమోదించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, రాయపాటి సాంబశివ రావు, ఎస్పీవై రెడ్డి, సాయి ప్రతాప్‌లు సభాపతి మీరా కుమార్ అపాయింటుమెంటును కోరారు. వారు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమెను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరనున్నారు.
తిరగబడాలి: బుద్ధ ప్రసాద్
సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం పైన తిరగబడాల్సిన సమయం వచ్చిందని మండలి బుద్ధ ప్రసాద్ కృష్ణా జిల్లాలో అన్నారు. హైదరాబాదు అభివృద్ధికి సీమాంధ్రులు ఎంతో కృషి చేశారని, అందులో తమకు భాగముందన్నారు. దివంగత ఇందిరా గాంధీ పేరు చెప్పి ఓట్లు అడుగుతూ ఆమె ఆశయాలకు కాంగ్రెసు తూట్లు పొడుస్తోందన్నారు. ఇందిర కోడలు విభజనకు ముందడుగు వేయడం దురదృష్టకరమన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. తెలుగు జాతి ఢిల్లీ పై కన్నెర్ర జేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. విభజిస్తే తాము చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు.
ఉద్యమం ఉధృతం: అశోక్ బాబు
అక్టోబర్ 1వ తేది నుండి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఎస్మాకు భయపడేది లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమం వల్లనే కేంద్రం విభజనపై వెనకడుగు వేసిందన్నారు. రేపు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. సీమాంధ్ర నేతలు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత నేతల పైనే ఉందన్నారు. ఈ నెల 29న కర్నూలులో భారీ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications