స్మార్ట్ ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు, 11 నుంచి రుణమాఫీ
హైదరాబాద్: స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు, సినీ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అఖిల భారత సర్వీసు అధికారులు ఈ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన గ్రామం లేదా వార్డును అభివృద్ధి చేస్తే రాష్ట్రం రూపురేఖలను మార్చేయవచ్చునని ఆయన అన్నారు. ఆయన మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆ విషయాలు వెల్లడించారు.
ఈనెల 11 నుంచి 19 వరకు రైతు సాధికారక సదస్సులు నిర్వహించనున్నట్లు చంద్రబాబునాయుడు తెలిపారు. అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని, జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టినట్లు సీఎం వెల్లడించారు. మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా పండ్లతోటలకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతులకు మద్దతు ధర అందించాలని అధికారులకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో లెవీ తగ్గుతుందని, ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి ఎస్‌సీఐకి అందజేయవచ్చునని చెప్పారు.

పెన్షన్‌దారులకు బ్యాంక్ ద్వారా పెన్షన్లు ఇస్తామన్న సీఎం సక్రమంగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు. పంటలవారీగా భూసార పరీక్షలకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా వయోజన విద్యా కార్యక్రమం బాగుందన్నారు. ఓపెన్ వర్సిటీతో అనుసంధానం చేస్తూ వయోజన విద్యా కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.
ప్రతి కుటుంబానికి 2 బ్యాంకు ఖాతాలు ఉండాలని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్నారు. స్మార్ట్ ఏపీ, స్మార్ట్ మున్సిపాలిటీ, స్మార్ట్ గ్రామం మన లక్ష్యమని బాబు స్పష్టం చేశారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, ఎన్‌జీవోలు, సినిమా వాళ్లు ఇతర ప్రముఖులు గ్రామాల దత్తతకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
రుణమాఫీ విధివిధానాలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 11న చిత్తూరు జిల్లాలో రైతు రుణమాఫీ అమలును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రుణమాఫీకి సంబంధించి రైతులకు చంద్రబాబు బాండ్లను అందజేయనున్నారు.












Click it and Unblock the Notifications