మోడీకోసం స్మిత సాంగ్, కేజ్రీ పార్టీలో మల్కాజిగిరి చిచ్చు
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం ప్రముఖ పాప్ గాయని, హాయ్ రబ్బా స్మిత పాట పాడారు. మోడీ ప్రధాని కావాలని ఆమె పాట పాడారు. మోడీకి మద్దతుగా పాటను చిత్రీకరించిన స్మిత ఈ రోజు వేక్ అప్ ఇండియా పేరుతో ఆల్బమ్ విడుదల చేశారు. ఈ సరికొత్త ఆల్బమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఎఎపిలో మల్కాజిగిరి చిచ్చు
మల్కాజిగిరి స్థానం కోసం అన్ని పార్టీల్లోను పోటాపోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీలోను మల్కాజిగిరి చిచ్చు రాజేసింది. దేశంలోని అతిపెద్ద లోకసభ స్థానమైన మల్కాజ్ గిరిపై అన్ని రాజకీయపార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఎఎపి తరపున మల్కాజిగిరికి పోటీ చేసేందుకు చందనా చక్రవర్తిని అభ్యర్థిగా ప్రకటించింది.
దీంతో ఆమె ప్రచారకార్యకలాపాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఆ పార్టీ మాజీ ప్రధాని పివి నర్సింహారావు మనవడు ఎన్వీ సుధాకిరణ్‌కు మల్కాజిగిరి సీటు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. దీంతో చిచ్చు రేగింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పోటీ నుంచి తప్పుకునేందుకు చందనా చక్రవర్తి నిర్ణయించగా ఆమె మద్దతుదారులు మండిపడుతున్నారు.
ఆది నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని, పార్టీకి సంబంధం లేని వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట వారు ధర్నా చేపట్టారు. దీంతో సుధా కిరణ్ మాట్లాడుతూ.. తాను పార్టీ ప్రారంభం నుంచి కొనసాగుతున్నానని, సభ్యత్వం కూడా తీసుకున్నానని తెలిపారు. తనకు పోటీ చేయాలనే కోరిక లేదని, అయితే పార్టీ టికెట్ కేటాయించడంతో పోటీలో నిలబడ్డానన్నారు.












Click it and Unblock the Notifications