కాంట్రాక్ట్ పెళ్లి భగ్నం: రూ.80 వేలకు యువతితో 15 రోజుల పెళ్లి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పాతబస్తీలో ఓ కాంట్రాక్ట్ వివాహాన్ని సౌత్ జోన్ పోలీసులు భగ్నం చేశారు. ఓ సోమాలియా వ్యక్తి సయ్యద్ పాతబస్తీకి చెందిన ఓ యువతిని కాంట్రాక్టు చేసుకోవడానికి ప్రయత్నించాడు. 80 వేల రూపాయలకు 15 రోజుల పాటు పెళ్లికి ఒప్పందం చేసుకున్నాడు. సరిగ్గా నిఖా జరగడానికి రెండు నిమిషాల ముందు పోలీసులు ఫలక్‌నుమా సమీపంలోని ఇంటిపై దాడి చేసి ఆ పెళ్లిని భగ్నం చేశారు.
సయ్యద్‌తో పాటు బ్రోకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమ్మాయి కుటుంబానికి సయ్యద్ ఇచ్చే 80 వేల రూపాయల్లో 20 వేల రూపాయలు బ్రోకర్‌కు వెళ్తాయని తెలుస్తోంది. పాతబస్తీలో ఇంకా కాంట్రాక్టు వివాహాలు జరుగుతూనే ఉన్నాయని డిసిపి ఆవేదన వ్యక్తం చేశారు.

ఖ్వాజీ ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేసి ఆ కాంట్రాక్టు వివాహాన్ని భగ్నం చేశారు. గతంలో కూడా నలుగురు అమ్మాయిలకు ఇలాగే పెళ్లిళ్లు చేశామని, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఉంటుందని అమ్మాయి తల్లి అంటున్నట్లు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. యువతి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేసి యువతిని పోలీసులు వారికి అప్పగించారు.
గతంలో కూడా ఇలాగే ఓ సోమాలియా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష రూపాయలకు 9 రోజుల పాటు ఓ యువతితో వివాహానికి ఆ వ్యక్తి కాంట్రాక్టు చేసుకున్నాడు. అప్పుడు కూడా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పాతబస్తీ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారిని షేక్‌లు తమ దేశాలకు తీసుకుని వెళ్లి కాంట్రాక్టు ముగియగానే తిరిగి పంపిస్తారు.












Click it and Unblock the Notifications