మాస్టర్ ప్లాన్ వేస్తున్న అధికారులు, మడత పెట్టి కొట్టాలని చూస్తున్న కూటమి నాయకులు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు ఊపందుకున్నాయి. ఒక్క శాఖకే పరిమితం కాకుండా వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అధికారులను పలు ప్రాంతాలకు బదిలీలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆపార్టీ నాయకులతో అంటకాగి ఊరేగిన అధికారులను ప్రాధాన్యతలేని ప్రాంతాలకు బదిలీ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది.
వైసీపీ నాయకులతో ఇంతకాలం చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన కొంతమంది అధికారులు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. సార్.... జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు ఆ పార్టీ నాయకులతో కాని, వైసీపీ కార్యకర్తలతో కాని మాట్లాడమని, వారిని కన్నెత్తి కూడా చూడమని, మమ్మల్ని మీరే రక్షించాలని, దూర ప్రాంతాలకు బదిలీ చేసి మా కుటుంబాలకు దూరం చేయకూడదని కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు మనవి చేస్తున్నారని తెలిసింది.

ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసి, మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, నగరపాలక, అటవీ శాఖ, ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బందికి మాత్రం కచ్చితంగా స్థానచలనం కల్పించాలని, వాళ్లు మళ్లీ ఇక్కడే పని చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని టీడీపీకి చెందిన కొందరు నాయకులు ఆ పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది.
అయితే ఐదు సంవత్సరాల పాటు వైసీపీ నాయకులు చెప్పిన మాటలకి ఎస్ సార్ అంటూ సెల్యూట్ చేసిన అధికారులకు ఇప్పుడు మేము సహాయం చేస్తే ముందు ముందు మాకిందకే నీళ్లు తెస్తారని కొందరు టీడీపీ, జనసేన నాయకులు వెనకా ముందు ఆలోచిస్తున్నారని తెలిసింది. కూటమి ప్రభుత్వంలోని నాయకులు కొందరు అధికారులను దూరం పెట్టినా, కొందరు నాయకులు అలాంటి అధికారులను ఛీ కొట్టినా కూడా కొందరు ఉద్యోగులు మాత్రం వాళ్లు పని చేస్తున్న చోట నుండి బదిలీలు కాకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
గతంలో కొందరు రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలు, ఆర్థికంగా బలంగా ఉన్న కొంతమంది అధికారులు ఇప్పటికే వాళ్ళ బదిలీలను అడ్డుకోవడానికి వారు పని చేస్తున్న శాఖలోని పై అధికారులను సంప్రదించారని, ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోకుండా వారు అనుకున్న ప్రాంతాలకు బదిలీ చేసుకోవడానికి, ఇప్పుడు పని చేస్తున్న చోటే ఉండాలని కొందరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆ ప్రాంతానికి 20, 30 కిలోమీటర్ల దూరంలోనే మరో ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని, కొంతకాలం తరువాత మళ్లీ వారు కోరుకున్న ప్రాంతాలకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అయితే ఇప్పటికే వైసీపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన కొంతమంది అధికారుల జాబితా తయారు చేసిన కూటమి నాయకులు ఆ అధికారులకు సినిమా చూపించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications