వాటాల కోసం ఎమ్మెల్యేల బెదిరింపులు - లిస్టులో..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై అయిదు నెలలు పూర్తవుతోంది. కొందరు ఎమ్మెల్యేల తీరు మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్రంలో మద్యం, ఇసుక వ్యవహారాల్లో కూటమి ఎమ్మెల్యే లు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు పదే పదే హెచ్చరించారు. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం వీటిల్లో తమ వాటాల కోసం బెదిరింపులకు దిగుతున్నారు. పలు ప్రాంతాల్లో తమకు వాటాలు ఇవ్వని వ్యాపారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వీరి పైన తాజాగా మీడియాలో వస్తున్న కధనాలు కూటమి పార్టీల్లో కలకలానికి కారణమవుతున్నాయి.
ఎమ్మెల్యేల హెచ్చరికలు
రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న విధానంలో మార్పులు చేసి ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ అమలు చేస్తోంది. షాపులు కేటాయించింది. మద్యం దుకాణాల టెండర్ల సమయం నుంచి రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారింది. పలు ప్రాంతాల్లో మద్యం వ్యాపారులను టెండర్లు వేయనీయకుండా అడ్డుకున్నారంటూ అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో సీఎం చంద్రబాబు అలాంటి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇక, మద్యం వ్యాపారులకు దుకాణాలు ఖరారయ్యాయి. కానీ, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వారి బంధుగణం ఇప్పటికీ వాటా కోసం బెదిరింపులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వ్యాపారులకు ఇబ్బందులు
మద్యం వ్యాపారులు తమ నియోజకవర్గాల్లో వ్యాపారం చేయాలంటే తమకు 30 నుంచి 40 శాతం వరకు వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ 25 నుంచి 30 లక్షల వరకు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నారు. అంగీకరించని వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం లేకుండా అడ్డుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. తమకు వాటాలు ఇవ్వని వ్యాపారులను నిబంధనల పేరుతో అధికారులతో కొర్రీలు పెట్టించి వేధిస్తున్నారు. వారికి రెగ్యులర్ లైసెన్సులు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో, లక్షల రూపాయలు ఖర్చు చేసి వ్యాపారానికి ముందుకు వచ్చిన వారు నష్టపోతున్నారు.
పరోక్షంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.
ఎమ్మెల్యేల అడ్డంకులు
రాష్ట్రంలో అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. కాగా, ఇప్పటికీ 15 శాతం దుకాణాలకు ఇంకా రెగ్యులర్ లైసెన్సులు లేవు. సాధారణంగా ప్రొవిజనల్ లైసెన్సులు పొందిన పది రోజుల్లోనే అధికారులు రెగ్యులర్ లైసెన్సులు జారీ చేస్తారు. కానీ, ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా వీటి జారీ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. తమకు వాటా ఇచ్చేందు కు అంగీకరించని వ్యాపారులకు షాపులు అద్దెకు ఇచ్చే యజమానులను సైతం ఎమ్మెల్యేల అనుచరులు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు, తిరుపతి, వైఎస్సార్, కర్నూలు, అన్నమయ్య జిల్లాతో పాటుగా పల్నాడు, కాకినాడ, కర్నూలు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీఎం హెచ్చరించిన మారని ఎమ్మెల్యేల పైన ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.












Click it and Unblock the Notifications