మాధవ్ కామెంట్స్ పై సోము వీర్రాజు రియాక్షన్-జనసేనతో పొత్తు-వైసీపీతో స్నేహంపై క్లారిటీ..!
ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగిస్తూ, వైసీపీతో పరోక్ష స్నేహం సాగిస్తూ రోజుకూ ఊహాగానానికి కారణమవుతున్న బీజేపీపై అంచనాలు నానాటికీ తగ్గిపోతున్నాయి.
విజయవాడ : ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగిస్తున్నామంటూ ఓసారి, పొత్తున్నా లేనట్లే అంటూ మరోసారి వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు తాజాగా మరో రచ్చకు కారణమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ అభ్యర్ధి మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై స్పందించిన పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిద్దుబాటు చర్యలకు దిగారు.
ఏపీలో జనసేనతో పొత్తున్నా లేనట్లేనని నిన్న మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ స్పందించేందుకు సోము వీర్రాజు నిరాకరించారు. అయితే మాధవ్ వ్యాఖ్యల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుకు కాలం చెల్లిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సోము ఖండించారు. బీజేపీ-జనసేన విడిపోతాయని చెప్పనంటూ సోము పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాగే మీ కోరిక ఫలించదంటూ మీడియా ప్రతినిధుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ-వైసీపీ ఒక్కటే అని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సోము స్పందించారు. అది కేవలం అపోహ మాత్రమేనన్నారు. వైసీపీపై తాను ఇవాళ కూడా విమర్శలు చేసినట్లు గుర్తుచేశారు.

ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని చెప్పే పార్టీ బీజేపీ అని సోము వీర్రాజు తెలిపారు. అమరావతి ని రాజధాని గా అభివృద్ధి చేస్తూ మోడీ నిధులు ఇచ్చారని, విజయవాడలోనే మూడు ఫ్లై ఓవర్ లు, ఇబ్రహీంపట్నం వద్ద ఆరు లైన్ ల వంతెన నిర్మించామని గుర్తుచేశారు. విజయవాడ కేంద్రంగా అన్నివైపులా ఆరు లైన్ల జాతీయ రహదారి వేశామన్నారు. డబ్బులు ఇస్తే అభివృద్ధి చేయకుండా మాటలు చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక్కడే రాజధాని అనే ఎయిమ్స్ తో పాటు అనేక సదుపాయాలు కల్పించామన్నారు.
ఇదే రాజధాని, అభివృద్ధి, చేస్తా ఇల్లు కట్టా అని ఆనాడు చెప్పారంటూ జగన్ పైనా విమర్శలు చేశారు. ఇప్పుడు విశాఖ రాజధాని అని మాట మార్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇల్లు కట్టుకుని విశాఖ వెళ్ళడం ఏంటన్నారు. విశాఖ ను మీరేంటి అభివృద్ధి చేసేది.. ఇప్పటికే అభివృద్ధి చెందిందన్నారు. జగన్ ప్రభుత్వం రెండు వందల కొట్లు కూడా విశాఖకు ఖర్చు చేయలేదన్నారు. జగన్ ప్రభుత్వంపై ఛార్జిషీటు సిద్దం చేస్తున్నామని సోము తెలిపారు. అన్ని స్థాయిల్లో పరిశీలన చేసి జగన్ మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ కాంగ్రెస్ లో శిక్షణ పొందిన వారేనన్నారు. తమకు హత్యలు, దోపిడీలు చేసే నాయకులు లేరన్నారు.












Click it and Unblock the Notifications