బంగారు నగల కోసం తల్లినే చంపిన తనయుడు .. కడప జిల్లాలో దారుణం
నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. తనకు ఊపిరి పోసిన తల్లి అన్న కనికరం కూడా లేకుండా ఆమె ఊపిరి తీసాడు. కేవలం బంగారు ఆభరణాల కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు చేసిన దారుణ ఘటన ఆవేదనకు గురి చేసింది. కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే

తాగుడుకు బానిసైన కొడుకు తీరుతో పుట్టింటికి వెళ్ళిపోయిన కోడలు
కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం శివశంకరాపురం గ్రామానికి చెందిన రామయ్య, నరసమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచిన నాగరాజు మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇక నాగరాజు ప్రవర్తన నచ్చక, మద్యానికి బానిసైన అతని వేధింపులు తాళలేక భార్య అతనికి దూరంగా పుట్టింటికి వెళ్ళి ఉంటుంది. భార్య బంగారు నగలు సైతం నాగరాజు తాకట్టు పెట్టడంతో భార్య తల్లిదండ్రులు ఆమె కుటుంబం నాగరాజు పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

కుదువ పెట్టిన బంగారం విడిపించి తెస్తే ఇంటికొస్తానన్న భార్య .. తల్లిపై ఒత్తిడి చేసిన కొడుకు
పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రమ్మని నాగరాజు ఇటీవల భార్య కుటుంబ సభ్యులతో, భార్య తో మాట్లాడుతున్నాడు. అయితే తాకట్టు పెట్టిన తన బంగారు నగలను విడిపించి తీసుకొస్తే కాపరానికి వస్తానని, లేదంటే కాపురానికి వచ్చేది లేదని భార్య తేల్చి చెప్పింది. ఈ క్రమంలో నాగరాజు తన తల్లి దగ్గరకు వెళ్ళి తన భార్య బంగారాన్ని వినిపించాలని కోరాడు. ఆమె తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో, భార్య బంగారాన్ని విడిపించడానికి నాగరాజు తన తల్లి బంగారాన్ని ఇవ్వాలని కోరాడు. మద్యానికి బానిసైన కొడుకు తన బంగారాన్ని ఇస్తే మళ్లీ దుర్వినియోగం చేస్తాడని భావించిన తల్లి తన నగలను ఇవ్వడానికి నిరాకరించింది.

నగలు ఇవ్వలేదని తల్లిని హతమార్చిన తనయుడు
దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు నాగరాజు రోకలిబండతో నరసమ్మ తలపై బాది హతమార్చాడు. రక్తపు మడుగులో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లి వద్ద ఉన్న డబ్బులు, నగలు తీసుకుని కుమారుడు అక్కడి నుండి పరారయ్యాడు. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి నరసమ్మ భర్త రామయ్య కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నరసమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన
కేవలం నగల కోసం తల్లి ప్రాణాలు తీసిన కసాయి డబ్బులు, నగలు తల్లి ప్రేమను తిరిగి తెచ్చి ఇవ్వలేవని గుర్తించలేకపోయాడు. బంగారు నగలు అడిగితే తల్లి ఇవ్వలేదన్న కోపంతో క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. కొడుకు చేసిన పనితో ఓ భర్త భార్యను కోల్పోగా, తల్లిని హతమార్చిన కొడుకు జైలు పాలు కావడంతో కోడలు జీవితం ప్రశ్నార్థకంగా మారడం ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది. సమాజంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారుతుంది. అంతరించిపోతున్న మానవ సంబంధాలకు అద్దం పడుతుంది.












Click it and Unblock the Notifications