AP weather: రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు
అమరావతి: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. రుతు పవనాలు స్థిరంగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర కోస్తాలో మూడు రోజులపాటు వర్షాలు
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో తదుపరి మూడు నాలుగు రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలలో సోమవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ కోస్తాలోనూ ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు
దక్షిణ కోస్తాంధ్రలో సోమవారం నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు మరికొన్న చోట్ల కురిసే అవకాశముంది. మూడు రోజులపాటు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాయలసీమలోనూ 3 రోజులపాటు మోస్తరు వర్షాలు
మరోవైపు, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చల్లని వాతావరణం ఏర్పడే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగానే కొనసాగనున్నాయి. ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications