ఊగిపోయిన జగన్, గోరంట్ల 'ప్రొటెస్ట్', చేతులెత్తి దండం పెడ్తా: అచ్చన్న
హైదరాబాద్: వైసిపి అధ్యక్షులు జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను సభలో నడపాలనుకోవడం దురదృష్టకరమని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం అన్నారు. విపక్ష నేత వ్యాఖ్యల పైన తాను ప్రొటెస్ట్ చేస్తున్నానని చెప్పారు.
జగన్ ఆవేశంగా మాట్లాడుతుండగా.. సభాపతి కోడెల శివప్రసాద్ రావు జగన్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నారు. దానికి బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ఆయన కంట్రోల్ కారు అన్నారు.
ప్రత్యేక హోదా గురించి ఆందోళన అవసరం లేదు
ప్రత్యేక హోదా గురించి ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. హోదా తప్పకుండా వస్తుందన్నారు. వచ్చే విధంగా ప్రయత్నాలు చేద్దామన్నారు. రాని పక్షంలో ఏం చేయాలో అధికార, ప్రతిపక్ష పార్టీలతో కలిసి మేం (బిజెపి) ఆలోచిస్తామని, అందరం కలిసి నిర్ణయం తీసుకుందామన్నారు. జగన్ ప్రశ్నోత్తరాలకు సహకరించాలన్నారు.

సభ ఎన్ని రోజులన్నది ముఖ్యం కాదు: అచ్చెన్నాయుడు
సభ ఎన్ని రోజులు జరుగుతుందనేది ముఖ్యం కాదని, ఎంత సద్వినియోగం చేసుకుంటుందనేది ముఖ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మీరు (వైసిపి) తొలుత మూర్కత్వాన్ని వదిలి పెట్టాలన్నారు. ఎవరి స్వార్థం వల్ల విభజన జరిగిందో దానిని కూడా చర్చిద్దామన్నారు.
మేం రాష్ట్రం గురించి ఆలోచిస్తే, మీరు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి అంశంపై తాము చర్చకు సిద్ధమన్నారు. గోదావరి పుష్కరాల పైన చర్చకు తాము వెనుకడుగు వేస్తే అప్పుడు రాజకీయం చేయాలన్నారు. హోదా పైన కూడా చర్చకు సిద్ధమన్నారు.
విభజన నేపథ్యంలో ఏపీకి చాలా కష్టాలు ఉన్నాయని, అందరం కలిసి ముందుకెళ్దామన్నారు. రాష్ట్రానికి ఉపయోపడే ఏ సలహా ఇచ్చినా తాము సిద్ధమని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతామన్నారు.
ఆ తర్వాత ఎన్నికలు వచ్చే సమయంలో రాజకీయం చేద్దామని, ఆ సమయంలో ఎవరికి విశ్వాసం ఉంటే ప్రజలు వారిని గలిపిస్తారని, సభా సమయాన్ని వృథా చేయవద్దని, మీకు చేతులెత్తి దండం పెడుతున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, సభ రెండోసారి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications