నాపై 'ప్రత్యేక' బరువు.. తగ్గం, హైద్రాబాద్‌పై నాకు హక్కు లేదా, కెసిఆర్ రాద్దాంతం: బాబు
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారని, ప్రత్యేక హోదా-రాజధానితో తాము సంతృప్తి చెందమని.. హోదా మాత్రమే సరిపోదాని ఏపీకి ఇంకా చాలా కావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు.
ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి అడుగు వేయాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి సరిపోదని, ఇంకా చాలా కావాలన్నారు. హోదా కోసం కేంద్రంతో విభేదాలు కొని తెచ్చుకుంటే రాష్ట్రానికి నష్టమని అభిప్రాయపడ్డారు.
కేంద్రంతో సఖ్యతగా ఉండి రావాల్సినవి రాబట్టుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే సత్తా టిడిపికే ఉందన్న నమ్మకంతో ప్రజలు గెలిపించారని, దానిని నిలబెట్టుకుంటామన్నారు. హోదా ఒక్కటే వస్తే అన్నీ సరిపోతాయనుకుంటే ఎలాగని, తక్కినవన్నీ ఎలా సాధించుకోవాలో ఆలోచించాలన్నారు.
జాగ్రత్తగా అడుగులు వేయాలన్నారు. టిడిపికి తెలుగు వారంతా సమానమేనని, అంతా బాగుండాలని తమ కోరిక అన్నారు. ప్రజల్లో చైతన్యం ఉంటే ఎవరూ ఇష్టం వచ్చినట్టు మోసం చేయలేరని, ప్రజలను మభ్యపెట్టి తాత్కాలిక ప్రయోజనాలు పొందుదామనుకుంటే అది వారి భ్రమే అన్నారు.
అప్పుడే ఏదో అయిపోయినట్టు ప్రతికూల ఆలోచనలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట విభజన జరిగాక పొరుగు రాష్ట్రంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, కోర్టులు కూడా వారి చేష్టలను తప్పు పడుతున్నా ఇక్కడి నాయకులు వాటి గురించి మాట్లాడటం లేదన్నారు.

ఒక్క ప్రత్యేక హోదా గురించే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రాష్ర్టాభివృద్ధికి ఇంకా చాలా కావాలన్నారు. వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని, రాజధాని అభివృద్ధికి నిధులు కావాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకూ కేంద్ర సహకారం కావాలన్నారు. ఎన్నో అవసరాలున్నాయన్నారు.
అన్నిటినీ వదిలేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. కొంత ఓర్పు, సహనం అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రజలకు అవగాహన కలగచేయటానికి వివరణ పత్రాలు ముందుంచుతానని చంద్రబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ‘వివిధ రాజకీయ పార్టీల తీరు - తెలుగుదేశం పార్టీ విధానం' పేరిట వివరణ పత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. విభజన నిప్పు పెట్టింది వైయస్ అని, సోనియా ఆజ్యం పోశారన్నారు. వైసిపి, టిఆర్ఎస్ విభజన కుట్రలో భాగస్వాములన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నో చారిత్రక తప్పిదాలు చేసిందన్నారు. కాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్య్తేక హోదా విషయమై ప్రధాని మోడీని త్వరలో కలవనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి నిర్లక్ష్యం చేయదన్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాన హక్కులు ఉండవా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మరో ప్రభుత్వం సబార్డినేట్‌గా ఉంటుందా అని నిలదీశారు. హర్యానా, పంజాబ్‌ల రాజధాని చండీగఢ్ ఎలా ఉందో గుర్తు చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications