రాజ్యసభలో హోదా: వెంకయ్యపై సీఎం అసహనం, పోరాడి ఓడామని సుజన

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు పైన రాజ్యసభలో శుక్రవారం నాడు మధ్యాహ్నం చర్చ కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. ఎంపీలు మాట్లాడారు.

పోరాడి ఓడిపోయాం: సుజనా చౌదరి

టిడిపి ఎంపీ, కేంద్రమంత్రు సుజనా చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని శాస్త్రీయ పద్ధతి లేకుండా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వారు విభజన చేశారన్నారు. విభజనకు వ్యతిరేకంగా పోరాడి మేం ఓడిపోయామని చెప్పారు. రాష్ట్ర విభజనకు రెండు జాతీయ పార్టీలదే బాధ్యత అన్నారు.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించిన తీరు ఏమాత్రం బాగా లేదన్నారు. అప్రజాస్వామికంగా నాడు విభజన బిల్లును ఆమోదించారన్నారు. విభజన వల్ల తెలంగాణ లాభపడిందన్నారు. ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటడిని నెరవేర్చాలన్నారు.

షెడ్యూల్ 9, 10, ఏపీ భవనం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ.. ఇలా ఎన్నో హామీలు నెరవేర్చాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని చెప్పే అధికారం ఆర్థిక సంఘానికి లేదన్నారు. ఏపీ కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.

Special status to Andhra Pradesh in Rajya Sabha

ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దన్నారు. నిండు సభలో ఇచ్చిన హామీలను విస్మరించకూడదన్నారు. నాడు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, మన్మోహన్ సింగ్ తదితరులు ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చారని చెప్పారు.

రాష్ట్రాన్ని అహేతుకంగా, ఎవరితో చర్చలు జరపకుండా చట్టసభల్లో సంఖ్యాబలం ఉండడంతో ముక్కలు చేశారన్నారు. చర్చ సందర్భంగా ఏపీని ఇతర రాష్ట్రాలతో పోలుస్తున్నారని, ఏపీ ఇతర రాష్ట్రాలు ఒకటి కాదన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు వేరు, ఇతర రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు వేరన్నారు.

కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న తమ ప్రభుత్వం బ్లేమ్ కాకూడదని, అందుకు తనకు సమాధానం చెప్పేందుకు సమయం ఇవ్వాలని సుజన అన్నారు. ఏపీకి చేయాల్సింది చాలా చేయాల్సిన సమయంలో కేంద్రం రాష్ట్రానికి చేస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి వివిధ విద్యాసంస్థలను కేటాయించిన కేంద్రం, ఇతర విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ప్లీజ్ ఐదు నిమిషాలు ఇవ్వండి

ప్రతి సభ్యుడికి డిప్యూటీ చైర్మన్ రెండు, మూడు నిమిషాల సమయం ఇచ్చారు. సుజనా చౌదరికి ఇచ్చిన టైం అయిపోవడంతో పలుమార్లు బెల్ కొట్టారు. తనకు ఐదు నిమిషాలు కావాలని సుజన విజ్ఞప్తి చేశారు. ఒకటికి రెండుసార్లు సుజన తనకు మరింత సమయం కావాలని అడిగారు.

ఓ సమయంలో సుజన అలా చదువుకుంటూ వెళ్తుంటే... డిప్యూటీ చైర్మన్ పలుమార్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. సుజన మాత్రం చదువుకుంటూ వెళ్లారు. ఓ సమయంలో మీరు కేంద్రమంత్రి అని, చర్చలో మీకు సమయాన్ని నిర్దేశించలేనని డిప్యూటీ చైర్మన్ చెప్పారు.

కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు: నరేష్ గుజ్రాల్

విభజన చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలేదని అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ అన్నారు.

హోదాతో పరిశ్రమలు: తోట సీతారామలక్ష్మి

టిడిపి ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. ప్రపంచానికి తెలియకుండా సభలో తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారన్నారు. ప్రత్యేక హోదాను ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలని నాడు వెంకయ్య చెప్పారన్నారు. విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, హోదాతో నవ్యాంధ్రను ఆదుకోవాలన్నారు. హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఏపీ డిమాండ్లకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

హోదా కాకపోతే మరొకటి: రాపోలు

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. ఏపీక్ ప్రత్యేక హోదా ఇవ్వాలని మార్చి 1, 2014న కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కష్టకాలంలో ఉన్న ఏపీకి హోదా ఇవ్వాలని చెప్పారు. కేబినెట్ నిర్ణయాన్ని అంగీకరిస్తారా లేదా అని ప్రశ్నించారు.

విభజన వల్ల రెండు రాష్ట్రాలకు లాభం కలిగిందని, రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. హోదా కావాలని చాలా రాష్ట్రాలు కోరుతున్నందున, హోదా కాకుండా మరోలా సాయం చేయాలని చెప్పారు. రాపోలు మాట్లాడుతుండగా పలుమార్లు డిప్యూటీ చైర్మన్ టైం అయిపోయిందని చెప్పారు.

బీహార్, యూపీ, ఒడిశాలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా లాంటిది ఇవ్వాలని చెప్పారు. ఈ బిల్లు వల్ల తెలుగు ప్రజలకు ఓ విషయం అర్థమైందని చెప్పారు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని రాద్దాంతం చేసింది, విభజన సమయంలో ఏపీకి న్యాయం జరగలేదని ఆరోపించిందని, ఇప్పుడు బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు ఏం చేయలేదన్నారు.

వెంకయ్య తీరుపై సీఎం రమేష్ అసంతృప్తి

నిన్న వెంకయ్య ఇచ్చిన సమాచారంపై టిడిపి ఎంపీ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకయ్య చెప్పిన దాని పైన తాము సంతృప్తిగా లేమని రాజ్యసభలో అన్నారు. నిన్న అన్ని పార్టీలు సభలో హోదా బిల్లుకు మద్దతిచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ చేసిన తప్పులు బీజేపీ చేయవద్దన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Special status to Andhra Pradesh in Rajya Sabha.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి