ఎస్ఆర్‌బిసి ప్రధాన కాల్వకు గండి: బనగానిపల్లి బస్టాండ్‌లోకి నీరు
బనగానపల్లి: కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి సమీపంలో ఎస్ఆర్ బీసీ ప్రధాన కాల్వకు గండి పడింది. ప్రధాన కాల్వ నుంచి వృథాగా నీరు పోతోంది. దీంతో, బనగానపల్లి ఆర్టీసీ బస్టాండ్, పెండేకంటినగర్ తో పాటు పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్ లోకి భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఎస్ఆర్‌బిసి ప్రధాన కాల్వకు గండి పడి నీరంతా పల్లపు ప్రాంతాల్లోకి వచ్చి చేరుతోంది. కాలనీల్లోకి నీరు చేరడంతో కాలనీవాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఆర్టీసీ బస్టాండ్‌లో మోకాలి లోతు వరకు నీరు చేరడంతో బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.

ప్యాపిలి రహదారిలో నీరు రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తుండటంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో మోకాలి లోతు నీరు చేరడంతోపాటు పట్టణంలోని పలు దుకాణాల్లోకి నీరు ప్రవహించడంతో వాటిని మూసివేశారు. కాల్వకు స్వల్ప లీకేజీలు ఉండటం, కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో గండి పడినట్టు అధికారులు భావిస్తున్నారు.
విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గండి పూడ్చేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి ఆయన అక్కడ ఉంటూ పనులను పర్యవేక్షిస్తున్నారు..












Click it and Unblock the Notifications