బైరెడ్డి రాజధాని డిమాండ్: ఏమిటీ శ్రీబాగ్ ఒడంబడిక, ఎందుకు?

హైదరాబాద్: మద్రాసు రాష్ట్రం నుంచి వేరై రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ బ్రిటిష్ పాలకుల హయాంలోనే ప్రారంభమైంది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు మద్రాసు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించడానికి ఓ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అని అంటారు.. 1937లో ఈ ఒప్పందం జరిగింది.

కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాల నుంచి తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, తమకు ప్రత్యేకమైన రక్షణలు కావాలని రాయలసీమ నాయకులు పట్టుబట్టారు. అది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకంగా మారింది. దీంతో రాయలసీమ నాయకులను ఒప్పించడానికి ఆ ఒప్పందం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనే విషయంతో 1926లో ఈ విభేదాలు మొదలయ్యాయి.
అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి డా. సుబ్బారాయన్‌ తీసుకున్న నిర్ణయాలు అందుకు కారణమయ్యాయి. ఆ తరువాత 1913నుండి, 1935 వరకు జరుగుతూ వచ్చిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో, ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలోను ఇవి బయటపడుతూ ఉండేవి. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ఓడించడానికి రాయలసీమ, నెల్లూరు ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నించారు.

1937లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవాలలో పాల్గొన్న నాయకులు ఇరు ప్రాంతాల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గం ఏర్పాటు, నీటిపారుదల, రాజధాని మొదలైన విషయాలలో రాయలసీమకు రక్షణలు అవసరమన్న భావనను రాయలసీమ నాయకులు వ్యక్తం చేశారు. ఈ విషయాలను పరిశీలించేందుకు ఒక సంఘాన్ని నియమించారు.

Sree Bagh agreement assured guarantees to Rayalseema

ఈ సంఘ సభ్యులుగా భోగరాజు పట్టాభి సీతారామయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, హాలహర్వి సీతారామరెడ్డి, కడప కోటిరెడ్డి, కొండా వెంకటప్పయ్య, టి.ఎన్.రామకృష్ణారెడ్డి, మహబూబ్‌ ఆలీ బేగ్‌, దేశిరాజు హనుమంతరావు, కల్లూరు సుబ్బారావు, దేశపాండ్య సుబ్బారావు, వరదాచారి, పప్పూరి రామాచారి, సుబ్బరామిరెడ్డి, ముళ్ళపూడి పల్లంరాజు వ్యవహరించారు.

ఈ సంఘ సభ్యులంతా 1937 నవంబర్‌ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌లో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఇంటి పేరుమీదనే ఈ చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది.

శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు

విశ్వవిద్యాలయం: రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వం కోసం విద్యా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురంలో ఒక కేంద్రం ఏర్పాటు చెయ్యాలి.

సాగునీటిపారుదల అభివృద్ధి: వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాక, ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన చేసారు.

రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు ఆంధ్ర ప్రాంతంలో, హైకోర్టు రాయలసీమలో ఉంటే రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉండాలి. ఈ రెండింటిలో ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి.

ఆ శ్రీబాగ్ ఒడంబడిక మేరకే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోస్తాంధ్రలోని గుంటూరు జిల్లాలో గల అమరావతిని ఎంపిక చేశారు. దీంతో రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+