బుజ్జగింపులు: రాజీనామాకే శ్రీధర్ బాబు మొగ్గు?
హైదరాబాద్: తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికే శ్రీధర్ బాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించినందుకు నిరసనగా పౌరసరఫరాల శాఖనూ వదులుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ బుధవారమే ఆయన రాజీనామా పత్రం కూడా సిద్ధం చేసుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలతో చర్చించారు. ముందుగా పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. శాసనసభ వ్యవహారాల శాఖను తప్పించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయనకు తెలిపారు.
వాణిజ్య పన్నుల శాఖను తీసుకునేది లేదని, పైగా, పౌర సరఫరాల శాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు. డీఎస్‌తో భేటీ అనంతరం మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు కూడా ఉన్నారు. తాను రాజీనామా చేస్తానని శ్రీధర్ బాబు వారికి చెప్పారు.

తొందర పడవద్దని వారంతా వారించారు. అధిష్టానం పెద్దలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుందామని వివరించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిలతో జానారెడ్డి అప్పటికప్పుడు మాట్లాడారు. కీలకమైన సమయంలో శ్రీధర్ బాబు నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను కిరణ్ తప్పించారంటూ ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో పరిశీలిస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చారు. ఆయన వ్రతంలో ఎక్కువగా మాట్లాడలేదని, తొందర పడవద్దని సూచించారని తెలిసింది. ఆ తర్వాత సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో జానారెడ్డి తదితరులు మాట్లాడారు.
సీనియర్ నేతలతో చర్చలు, బుజ్జగింపుల తర్వాత కూడా శ్రీధర్‌బాబు వైఖరిలో మార్పు రాలేదని తెలిసింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని స్వయంగా కలవకుండా వేరొకరి ద్వారా రేపోమాపో రాజీనామా పత్రాన్ని పంపించాలని శ్రీధర్ బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శైలజానాథ్ మౌనం
కీలకమైన సమయంలో, అనూహ్యమైన పరిణామాల మధ్య 'శాసనసభా వ్యవహారాల' శాఖను అదనంగా పొందిన సాకె శైలజానాథ్ ఈ వ్యవహారంపై స్పందించలేదు. బుధవారం ఆయన అనంతపురంలో తనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారికి విందు ఏర్పాటు చేశారు. శాసన సభ వ్యవహారాల శాఖ బాధ్యతల అప్పగింతపై ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఈ ఏడాది కూడా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని బలంగా నమ్ముతున్నానన్నారు.












Click it and Unblock the Notifications