శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో పై బదిలీ వేటు:కొత్త ఈవో రామస్వామి
చిత్తూరు: శ్రీకాళహస్తి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భ్రమరాంబ పై బదిలీ వేటు పడింది. ఈవో భ్రమరాంబను ట్రాన్స్ ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు భ్రమరాంబకు వేరేచోట పోస్టింగ్ ఇవ్వలేదు.
ప్రస్తుతానికి ఆమెను వెయిటింగ్ లోనే ఉంచిన ప్రభుత్వం ఎండోమెంట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. ఇటీవలి కాలంలో శ్రీకాళహస్తిలో భ్రమరాంబ వైఖరి వివాదాస్పదంగా మారడమే ఆమె పై బదిలీ వేటు పడటానికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఈవో భ్రమరాంబ స్థానంలో రామస్వామి అనే అధికారిని ఆలయ ఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రామస్వామి కర్నూలు జిల్లా సంయుక్త కలెక్టర్-2గా విధులు నిర్వహిస్తున్నారు.

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల తాకిడితో క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంతో పాటు ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునే భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 83,743 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం జరగనుంది. ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టానక్షత్రానికి ముగిసేవిధంగా మూడు రోజుల పాటు ఈ అభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో ఈ ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. దీనినే అభిధ్యేయక అభిషేకం అని కూడా అంటారు. అభిషేకాది క్రతువులతో అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవం చేపడతారు.












Click it and Unblock the Notifications