శ్రీకాళహస్తి గర్భగుడి వరకు పాకిన కరోనా: అర్చకుడికి పాజిటివ్: రాహు, కేతువు కూడా ప్రవేశించని చోట
చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అయిదో విడత లాక్‌డౌన్ సడలింపులతో కొనసాగుతోన్న వేళ.. ఇందులో భాగంగా అన్ని ఆలయాల్లోనూ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇచ్చిన సమయంలో.. చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో కలకలం చెలరేగింది. శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా వైరస్ సోకింది. ఫలితంగా- ఈ తెల్లవారు జామునే ప్రారంభం కావాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. శుక్రవారం నుంచి భక్తుల రాకపై నిషేధం కొనసాగబోతోంది. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
శ్రీకాళహస్తి గర్భగుడి వరకు పాకిన కరోనా: అర్చకుడికి పాజిటివ్#coronavirus #Srikalahasti #AndhraPradesh pic.twitter.com/ggUFqhZpCa
— oneindiatelugu (@oneindiatelugu) June 10, 2020
హిందూ సంప్రదాయం ప్రకారం- రాహు, కేతువులు కూడా ప్రవేశించలేని ఆలయం.. శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధి. అందుకే- సూర్య, చంద్రగ్రహణ సమయాల్లో తిరుమల సహా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడినప్పటికీ..ఒక్క శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారికి యధాతథంగా పూజలు కొనసాగుతుంటాయి. అలాంటి ఆలయంపై కరోనా వైరస్ ప్రభావం పడింది. అర్చకుడికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో దర్శనాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. ట్రయల్ రన్‌ను వాయిదా వేశామని చెప్పారు.

శ్రీకాళహస్తి దేవస్థానంలో అర్చుకులు, ఆలయ ఉద్యోగులు, పరిచారికలు, ఇతర సిబ్బంది మొత్తం 71 మంది పని చేస్తున్నారు. ఆలయంలో భక్తులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వారందరికీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 15 మందికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. అందులో ఓ అర్చకుడు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని, మిగిలిన వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. శ్రీకాళహస్తిలో పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఒకదశలో ఒక్క శ్రీకాళహస్తి పట్టణంలోనే 65 వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications