TTD: పెద్దశేష వాహనంపై వైకుంటనాథుడి అలంకారంలో శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిరుమలలో ఎంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అంతే వైభవంగా టీటీడీ అనుబంధ దేవాలయాల్లో కూడా బ్రహ్మోత్పవాలు జరుగుతాయి. ఇప్పుడు తిరుపతితో పాటు తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు మొదలైనాయి.
తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు గురువారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు పరమపద వైకుంఠ నాధుడి అలంకారంలో కటాక్షించారు.

శ్రీనివాసమంగాపురంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు చూడటానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, టీటీడీ ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు - తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణం సందర్భంగా గురువారం సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

ఆ తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది.మార్చి 1వ తేదీన ధ్వజారోహణం జరగనుంది. మార్చి 1వ తేదీన ఉదయం 7. 40 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications