రెచ్చగొట్టిన వీడియోలేవి, అందరి బాగోతం ఉంది: రోజా ఇష్యూపై శ్రీకాంత్
కడప: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తాము మాట్లాడిన వీడియోలను ఇతరులకు ఇచ్చారని, అదే సమయంలో సభలో అధికార తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టిన వీడియోలను మాత్రం బయటకు వెల్లడించలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఆరోపించారు.
ఏపీ శాసన సభ ప్రొసీడింగ్ సీడీలు అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరొకలా మారాయని విమర్శించారు. ఇది ఎక్కడి న్యాయమని ప్రశఅనించారు. సభాపతి నియమించిన కమిటీకి ఏ అంశాల పైన చర్చించాలో ఇప్పటి వరకూ నియమ నిబంధనలు ఇవ్వలేదన్నారు.
అధికార పార్టీకి అనుకూలమైన వీడియోలు ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పే మాటలకు, స్పీకర్ మాటలకు పొంతన లేదన్నారు. సభ వాయిదా పడ్డ సమయంలో మాటలను దృష్టిలోకి తీసుకోవడం సబబు కాదన్నారు.

స్పీకర్ చైర్మ మీద గౌరవం ఉందని, త్రిసభ్య కమిటీ సమావేశాలకు హాజరవుతామన్నారు. చట్టసభల దృశ్యాలు లీక్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అన్ని వీడియో ఫుటేజీలు విడుదల చేసి ఉంటే అందరి బాగోతం బయటపడేదన్నారు.
తాము ఇచ్చిన అవిశ్వాసం నోటీసు పైన ఇంకా స్పష్టమైన జవాబు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 22 నాటి జీరో అవర్ అంశాల పైన మాత్రమే కమిటీ వేయడం దారుణమన్నారు. తమ అభ్యంతరాలన్నింటి పైన చర్చ జరగాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అసెంబ్లీ విజువల్స్ మీడియాకు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. సోషల్ మీడియాకు కూడా ఎలా విడుదలయ్యాయో చెప్పాలన్నారు. మీడియాకు విజువల్స్ ఇచ్చిన వారిని శిక్షించాలన్నారు. అధికార పార్టీ నేతలు సభలో ఏం మాట్లాడాలో కొందరు రాసిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో రోజా ఇష్యూ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications