Srisailam Dam: శ్రీశైలం ఖాళీ! చరిత్రలోనే ఆరో సారి.. కరువు దిశగా కృష్ణా బేసిన్?
ఈ ఏడాది ఎల్‌నినో ప్రతికూల ప్రభావంతో కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి రావాల్సిన స్థాయిలో వరద నీరు వచ్చి చేరలేదు. ప్రస్తుత నీటి సంవత్సరంలో సెప్టెంబరు 30 నాటికి ప్రాజెక్టు చరిత్రలోనే ఆరో అత్యల్ప నీటి లభ్యత (కేవలం 227.56 టీఎంసీలు) నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఎగువ నుంచి రాక తగ్గిపోవడం, మరోవైపు వర్షాలు సరిగా కురవక పోవడంతో తెలుగు రాష్ట్రాల పరిధిలో సాగు, తాగునీటి అవసరాలకు తోడు విద్యుదుత్పత్తి కోసం నీటిని ఎక్కువగా ఉపయోగించాల్సి వచ్చింది.
శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్-ఫ్లో తీవ్రంగా పడిపోయిన ఐదు చారిత్రక సందర్భాలను పరిశీలిస్తే ప్రస్తుత పరిస్థితి తీవ్రత స్పష్టమవుతుంది.

| ఏడాది | కనిష్ఠ నీటి నిల్వ (టీఎంసీలలో) |
| 2015-16 | 58.16 |
| 2003-04 | 129.47 |
| 2023-24 | 137.05 |
| 2012-13 | 197.5 |
| 2002-03 | 202.89 |
ఈ ఐదు సంవత్సరాల తర్వాత అత్యంత తక్కువగా నీరు చేరిన ఆరో సంవత్సరంగా ప్రస్తుత ఏడాది నిలిచింది.
కృష్ణానదిలో వరద ప్రవాహాలు తగ్గడానికి తోడు ఏటా శ్రీశైలం ప్రాజెక్టులో పేరుకుపోతున్న భారీ ఒండ్రుమట్టి కూడా పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా జలాశయం నిల్వ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోంది. నీటి మట్టాలు ఊహించిన దానికంటే వేగంగా పడిపోవడంతో కొల్లాపూర్ తీరప్రాంతం సోమశిలకు సమీపంలోని సప్త నదుల కలయిక ప్రదేశమైన పవిత్ర 'సంగమేశ్వర క్షేత్రం' సాధారణ సమయం కంటే చాలా ముందే నీటిపైకి తేలింది. ఇది కృష్ణా బేసిన్‌లో నెలకొన్న నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది.
శనివారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 845 అడుగులకు చేరుకోగా, మొత్తం నీటి నిల్వ 70.35 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ఎలాంటి ఇన్-ఫ్లో రావడం లేదు. ఇక నీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కనీస ప్రవాహాలు లేకపోవడంతో వచ్చే వేసవి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తాగు, సాగునీటి నిర్వహణ సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
