కార్తీకమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త
ఇంకొద్దిరోజుల్లో పవిత్ర కార్తీకమాసం ఆరంభం కాబోతోంది. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీకమాసం మొదలవుతుంది. ఈ నెలలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తెల్లవారు జామునే సముద్రం/నదీ స్నానం చేయడం, గంగమ్మ తల్లికి పూజలు చేయడం, దీపాలను వెలిగించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అయ్యప్ప భక్తులు మాలధారణ చేసేదీ ఈ నెలలోనే. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి శైవక్షేత్రాలన్నీ కార్తీక శోభను సంతరించుకుంటాయి. ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తుంటారు.
ఈ పవిత్రమాసంలో శ్రీశైలం ఆలయానికి వెళ్తే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి దేవస్థానం యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కార్తీకంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నందున దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోన్నారు. దర్శనం క్యూలైన్లు, అన్నప్రసాద వితరణ భవనం, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు.

క్యూలైన్లు, హోల్డింగ్ కంపార్ట్మెంట్లు, వసతి గదుల్లో దెబ్బతిన్న ఫ్లోరింగ్ మరమ్మతులు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, మజ్జిగ, అల్పాహారం అందించేలా పక్కా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం దర్శన వేళలు, రద్దీ, దర్శనానికి పట్టే సమయం వంటి వివరాలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రసారం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల భక్తులకు క్యూలైన్లలో స్పష్టమైన సమాచారం అందుతుంది.
కార్తీక మాసంలో స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద వితరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. అన్నప్రసాద భవనంలో రద్దీ ఏర్పడకుండా అదనపు కౌంటర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 3:30 గంటల వరకు అన్నప్రసాద వితరణను పొడిగించేలా చర్యలు తీసుకుంటోన్నారు. అలాగే సాయంత్రం వేళ 7 గంటల నుంచే అల్పాహార వితరణ చేపట్టనున్నారు.
లడ్డూ ప్రసాదం నిల్వ, టోకెన్ల జారీ విధానాన్ని మరింత సరళీకరిస్తోన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూలను ముందుగానే సిద్ధం చేస్తోన్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల కౌంటర్ల సంఖ్యను మరింత పెంచనున్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల కోసం భక్తులు ఎక్కువ సమయం పాటు నిరీక్షించకుండా ఉండటానికి నూతనంగా మరో మూడు కౌంటర్లను అదనంగా తక్షణమే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కౌంటర్‌ను కేటాయించనున్నారు.
కార్తీకమాసంలో వచ్చే వారాంతపు రోజులు, సోమవారాలు, దీపోత్సవం, ఏకాదశి, పౌర్ణమి వంటి విశేష సందర్భాల్లో స్పర్శ దర్శనాలను కుదించడం లేదా రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు. క్యూలైన్లలో భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ తనిఖీ చేశారు. సెలవు దినాలు, వీకెండ్ రోజులు, కార్తిక సోమవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోన్నారు.















Click it and Unblock the Notifications
