రేపే తిరుమలలో గరుడ సేవ: 2 లక్షల మందికి పైగా భక్తులు: పార్కింగ్ స్థలాలు ఇవే: టీటీడీ నిర్ణయాలు

Tirumala Srivari Brahmotsavalu 2024: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమ‌లలో శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు బకాసుర వధ అలంకారంలో దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవితో కలిసి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణించారు.

బ్రహ్మోత్సవాల్లో కీలకమైనది గరుడ సేవ. మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల గరుడ వాహనారూఢుడై దర్శనం ఇస్తారు శ్రీమలయప్ప స్వామివారు. ఈ వైభవాన్ని తిలకించడానికి ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Srivari Brahmotsavalu TTD made arrangement for the Devotees at Tirumala for Garuda Seva on Oct 8

ఈ సారి ⁠దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనిపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గరుడ సేవ దర్శనం కోసం గ్యాలరీలతో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఆయా పాయింట్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను ఈ రాత్రి 9 గంట‌ల నుంచి అక్టోబ‌రు 9వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రద్దు చేశారు. తిరుమలలో వాహనాల రద్దీని నివారించడంలో భాగంగా ప్రజారవాణాను వినియోగించుకోవాలి.

దాదాపు మూడు లక్షల మంది భక్తులను తరలించేలా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడువేల ట్రిప్పులను నడిపించనున్నారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్‌ స్థలాల నుంచి కూడా తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.

పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను అందిస్తారు. తిరుమలలోని బాలాజీ నగర్, కౌస్తుభం ఎదురుగా, రామ్‌బగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే- తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్‌ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు, వినాయకనగర్‌ క్వార్టర్స్‌, నెహ్రూ మున్సిపల్‌ పార్కు, భారతీయ విద్యాభవన్‌, దేవలోక్‌, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కార్లు, బస్సులను పార్క్ చేయవచ్చు.

గరుడ సేవ నాడు తిరుమలకు వచ్చే భక్తులకు వైద్య సేవలను అందించడానికి మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. 12 అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గరుడసేవను తిలకించడానికి మాడవీధులు, భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రామ్ బగీచ విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

గరుడ సేవను పర్యవేక్షించడానికి 1,250 మంది టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది, 5,000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలను సిద్ధం చేశారు. శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, క్యూలైన్లు సహా భక్తులు వేచివున్న ప్రతి చోటా అల్పాహారం, మంచినీరు, పాలు అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+