భీమవరం బుల్లోడు ఫంక్షన్‌లో యువకుడి మృతి
భీమవరం: సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు చిత్రం ఆడియో కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం అపశృతి చోటు చేసుకుంది. ఆడియో ఫంక్షన్‌లో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో సురేష్ అనే స్థానిక యువకుడు మరణించాడు. భీమవరం బుల్లోడు ఆడియో కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఏర్పాటు చేశారు. అది స్థానికంగా ఉన్న డిఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు.
ఊహించినదానికన్నా ఎక్కువ మంది కార్యక్రమానికి వచ్చారని అంటున్నారు. వేదికకు సమీపంగా ముందు వరుసలో ఉన్నవారిని వెనక వరుసలోనివారు నెట్టారు. ఈ గొడవలో సురేష్ కింద పడిపోయాడు. అయితే, ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. స్నేహితులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

సురేష్‌కు భార్య, ఓ పాప ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భవతి కూడా. అతను రిలయన్స్ సూపర్ మార్కెట్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఫిట్స్ కారణంగానే సురేష్ మరణించాడని పోలీసులు అంటున్నారు. ఈ వాదనను కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతున్నారు. సురేష్ మృతిపై ఆదివారం రాత్రి పది గంటల వరకు కూడా సినిమా యూనిట్ ప్రతిస్పందించలేదు.
భీమవరం బుల్లోడు చిత్రాన్ని సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్ సంస్థ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించారు. ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఎస్తేర్ కథానాయికగా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.












Click it and Unblock the Notifications