స్థానికం ముహూర్తం ఫిక్స్ - ఏ ఎన్నిక ఎప్పుడంటే...!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ఈ దిశగా తుది కసరత్తు చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను రెండు విడతల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. వార్డుల పునర్విభజన పూర్తయిన తరువాత షెడ్యూల్ జారీ కానుంది. డిసెంబర్ చివరి లోగా పూర్తిగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీంతో.. ఏ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో దాదాపు స్పష్టత వస్తోంది.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు కొనసాగుతోంది. రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసు లు ఉన్న 23 స్థానాలను మినహాయించి, మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహించేలా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తొలి దశలో 59 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో అధికారులు ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిదశలో విజయనగరం నగరపాలక సంస్థతో పాటు మరో 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ నెల 3వ తేదీనే డివిజన్లు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను అధికారులు ప్రచురించారు. ఓటర్ల జాబితా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపు ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నాటికి పూర్తి కానుంది. అయితే.. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ఈ నెల 13తో ముగుస్తుంది. మేయర్లతో పాటుగా మున్సిపాల్టీల చైర్మన్లు.. కార్పోరేటర్ల రిజర్వేషన్ల ఖరారు పక్రియ ఈ నెల 25వ తేదీ లోగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

ఎన్నికల సంఘం తుది కసరత్తు
అదే విధంగా రెండో విడతలో భాగంగా మిగిలిన 41 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ స్థానాలకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఈ నెల 11వ తేదీతో పూర్తి కానుంది. ఇవి పూర్తయిన తరువాత మూడో దశలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13,295 గ్రామ పంచాయతీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి అన్ని స్థానిక సంస్థల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. మరో వైపు రాజకీయ పార్టీలు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో.. పుర పోరు ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
