మన జీవితంలో సగభాగం కోసం ఇలా చేయండి!
మన జీవితంలో సగభాగం నిద్రలోనే గడిచిపోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలగడంతోపాటు శారీరక స్పందనల వేగం కూడా తగ్గుతుంది. మానసిక ఒత్తిడి, విపరీతమైన తలనొప్పి లాంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పోకపోతే నిద్రలేమికి దారితీస్తుంది. దీనికి అనేక కారణాలుంటాయి. సరైన కారణాన్ని గుర్తించగలిగితే నిద్రలేమి నుంచి బయటపడవచ్చు.
పగటి నిద్ర : పగటి పూట కొంత సమయం చిన్న కునుకు తీస్తే ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువ సమయం నిద్రపోతే శరీరానికి రాత్రివేళ నిద్ర అవసరం తగ్గుతుంది. మన ఒంట్లో జీవ గడియారం గతి తప్పడంతోపాటు పగటి పూట చురుగ్గా ఉండి రాత్రి నిద్ర పోయే ప్రక్రియ అస్తవ్యస్త మవుతుంది. నిద్ర లేమితో బాధపడేవారు పగటి నిద్రను మానుకుంటే మంచిది.

మేల్కొని పనిచేయడం తగదు : పనులతో సతమతమయ్యే మనసుకు, కండరాలకు విశ్రాంతి అవసరమవుతుంది. అడ్రినలిన్ హార్మోన్ తగ్గుముఖం పట్టేలా చూసుకోవాలి. నిద్ర పోవడానికి ముందు ఎటువంటి పనులు పెట్టుకోవద్దు. కార్యాలయానికి సంబంధించిన పనులు ముందేసుకొని రాత్రంతా మేల్కొని ఉండటం తగదు. ధ్యానం చేయడంతోపాటు మంచి సంగీతాన్ని వింటుండాలి.
వ్యాయామం చేయాలి : మనకు నిద్ర బాగా పట్టాలంటే శారీరకంగా శ్రమ ఉండాలి. ప్రతిరోజు ఉదయం సమయంలో వ్యాయామం చేయడం ఉత్తమం, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటివి చేస్తే స్వచ్ఛమైన గాలికి శరీరంతోపాటు మనసు కూడా ఉత్సాహంతో ఉంటుంది. శరీరం అలసిపోయి రాత్రివేళ గాఢంగా నిద్ర పడుతుంది.
సమయానికి నిద్రపోవాల : వేళకు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఒకే సమయానికి నిద్రించడంతోపాటు ఒకే సమయానికి లేవడం చేస్తుండాలి. దీనివల్ల నిద్ర వేళలు నియమబద్ధం అవుతాయి. రాత్రి నిద్రించడానికి ముందు గోరువెచ్చటి నీటితో సాన్నం చేయడం, పాలు తాగడంతోపాటు ఇంట్లో లైట్ల వెలుగు తగ్గించుకుంటే త్వరగా నిద్ర పడుతుంది.
ఆలస్యంగా తినడం : రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేయడం, పీకలదాకా తినడం, జీర్ణం కానివి తినడంవల్ల గుండె వేగం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి నిద్రను దెబ్బతీస్తాయి. నిద్రించడానికి మూడు గంటల ముందే భోజనం పూర్తిచేయాలి.
కాఫీ, టీ తాగొద్దు : సాయంత్రం వేళ టీ, కాఫీ ఎక్కువగా తాగకూడదు. దీనివల్ల రాత్రిపూట నిద్ర పట్టదు. శీతల పానీయాలు, రెడ్ వైన్, చాక్లెట్లు, ఛీజ్ వంటివి కూడా మంచి నిద్ర పట్టనీయవు.


Click it and Unblock the Notifications