టి బిల్లు: అఫిడవిట్ కిరణ్ అస్త్రమే, జగన్ ఆశలు దాని పైనే

ఇప్పటికే మంత్రి కాసు కృష్ణారెడ్డి నివాసంలో రిటైర్డ్ జస్టిస్ రెడ్డప రెడ్డి తదితరులతో సీమాంధ్ర మంత్రులు సమాలోచనలు జరిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా సుప్రీంలో కేసు వేశారన్నా, అంశాలవారీగా బిల్లులో తప్పులు చూపెడుతూ రాష్ట్రపతికి అఫిడవిట్ అందజేశారన్నా అఫిడవిట్ ప్రతులను స్పీకర్‌కు ఇచ్చారన్నా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమవుతుందని, ఫోకస్ అంతా రాష్ట్ర విభజన అంశంపైనే పడుతుందని భావించారు.
అఫిడవిట్లతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని తాము భావించడం లేదని, ప్రక్రియలో ఇదొక భాగమేనని ఇంకొందరు భావిస్తున్నారట. ప్రధానంగా రాజ్యాంగంలోని 371-డి ఆర్టికల్ ఆటంకమని, దీనిని సుప్రీం కోర్టు సహా రాష్ట్రపతి ముందుకు తీసుకువెళ్లడం ద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఇదంతా రాష్ట్ర విభజనపై కేంద్ర నిర్ణయాన్ని జాప్యం చేసేందుకు మాత్రమేనని చెబుతున్నారు.
మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వీలుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించారని, అప్పటి వరకూ రాష్ట్ర విభజనను అడ్డుకోగలిగితే ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినట్లేనని భావిస్తున్నారు. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మళ్లీ కథ మొదటికే వస్తుందని భావిస్తున్నారు. అఫిడవిట్‌తో రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. బుధవారం రాత్రి కూడా ఆయన కొందరు రిటైర్డ్ జస్టిస్‌లతో సమాలోచనలు జరిపారట కూడా. అఫిడవిట్‌పై సీమాంధ్ర నేతలు ఆశలు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అఫిడవిట్ల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన ఆపాలంటే పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ సమైక్యాంధ్రకు అనుకూలంగా అఫిడవిట్లను ఇవ్వాలని సూచించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాదు వచ్చిన రాష్ట్రపతికి సమైక్యాంధ్రకు అనుకూలంగా అందరం అఫిడవిట్లను సమర్పిద్దాం రావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications