మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కూటమి ఎమ్మెల్యే..అందుకేనా ఇలా..?
రాజకీయాల్లో పదవి, అధికారం లేకపోతే నాయకుల్లో అసహనం పెరగడం సహజం. ప్రస్తుతం ఇదే ధోరణి బీజేపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచినప్పటికీ, ఆయన ఆశించిన స్థాయిలో కీలక పదవులు దక్కకపోవడంతో, ఆయనలో పేరుకుపోయిన బాధ అసెంబ్లీ వేదికగా బయటపడింది.
తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కాకపోవడంతో, అధికార కూటమిలోని ఎమ్మెల్యేలే విపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. ఇదే సమయంలో సుజనా చౌదరి చేసిన కామెంట్స్ ఆయనలోని అసంతృప్తిని స్పష్టంగా తెలియజేశాయి.

అమరావతి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి సరైన న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖలోని రుషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వీటిపై ఆయన చేసిన వ్యాఖ్యలు, పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందనే అర్థం వచ్చేలా ఉండటం గమనార్హం. పదవులు దక్కకపోవడం, అనుకున్న స్థాయిలో పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతోనే ఆయన తనలో ఉన్న అసంతృప్తిని ఇలా బయటపెట్టారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సుజనా చౌదరి రాజకీయ ప్రస్థానంలో అధికారం అనుభవం కొత్త కాదు. ఆయన సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాకముందే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు, కేంద్రంలో టీడీపీ భాగస్వామి కావడంతో కేంద్రమంత్రి పదవి దక్కింది. ఐదేళ్లపాటు కేంద్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.
అయితే, 2019లో టీడీపీ ఓడిపోవడంతో, ఆయన బీజేపీలోకి మారారు. అప్పటి నుంచి ఆయన ఆశించిన పదవులన్నీ దూరమవుతూ వచ్చాయి.రాజ్యసభ రెన్యువల్ ఆశించారు, కానీ మాజీ ఎంపీ అయ్యారు.2024 ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించారు, కానీ ఎమ్మెల్యే టికెట్ దక్కింది.మంత్రి పదవి ఆశించారు, కానీ అది దక్కలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు, అది కూడా దక్కలేదు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బీజేపీకి దక్కాల్సిన మంత్రి పదవులకు సంబంధించి అవకాశాలు మూసుకుపోవడంతో, ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ వరుస నిరాశల నేపథ్యంలోనే ఆయనలో అసహనం పెరుగుతోంది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఎంత అసహనం వ్యక్తం చేసినా, 2029 ఎన్నికల వరకు కూటమిలోనే కొనసాగుతూ వేచి చూడటం మినహా మరో మార్గం లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సుజనా చౌదరి తన రాజకీయ భవిష్యత్తును ఎలా మలుచుకుంటారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications