రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు: జగన్ ప్రభుత్వానికి నిరాశే
అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై ఇవ్వాళ సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. అనంతరం వాయిదా వేసింది. తదుపరి విచారణను జులై 11వ తేదికి వాయిదా వేసింది.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లన్నింటిపైనా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వాళ విచారణ చేపట్టింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తన విచారణను కొనసాగించింది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, నిరంజన్ రెడ్డి, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగలేదు.

పిటీషన్లు విచారణకు వచ్చిన కొద్దిసేపటికే- దీని గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. తాజా పరిస్థితుల గురించి న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది నవంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తోందని న్యాయవాదులు వివరించారు. ప్రభుత్వం మాత్రం- విశాఖపట్నానికి తరలి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తోందని పిటీషనర్ల తరఫు లాయర్లు- న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయిస్తామని, తాను కూడా అక్కడి నుంచే పరిపాలన సాగించబోతోన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో, వేర్వేరు వేదికల మీద ప్రకటించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరిపాలన సౌలభ్యం కోసమే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి గుర్తు చేశారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించడానికి గల ఉద్దేశాన్ని వివరించారు.
వాదనలను విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటీషన్లపై తదుపరి విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి- వీలైనంత త్వరగా ఈ పిటీషన్లపై విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో- విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించింది కూడా. ఈ విషయంలో ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. నిర్దేశిత వాయిదా గడువు కంటే ముందుగా దీన్ని లిస్టింగ్ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications