స్థానిక ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా పై సుప్రీం కీలక ఆదేశాలు...!!
ఏపీలో స్థానిక ఎన్నికల పై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పైన దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కొట్టి వేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.. ఆ తీర్పు సహేతుకంగా ఉందని వ్యాఖ్యానించింది. ఏపీ పిటీషన్ ను విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా , షీల్ నాగు ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితా పైన కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు తీర్పునే సుప్రీం సమర్థించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్దేశించిన విధంగా ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. సర్ పక్రియ పూర్తయితే ఆ జాబితాతో ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది.

కాగా.. హైకోర్టు ఇచ్చిన గడువు లోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధం అని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం లేదా రేపు ఎన్నికల సంఘం ముందుగా మున్సిపల్ ఎన్నికల పైన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. తాము ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది.
కాగా, వార్డుల పునర్విభజన అడ్డుకోవడం ఎన్నికలు ఆపడమేనన్న ధర్మాసనం.. ఎన్నికలను అడ్డుకోవడం ప్రజాప్రయోజనాలను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. కాగా, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల పైన పూర్తి సమాయత్తం అవుతోంది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దిశా నిర్దేశం చేసింది.
ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కమిషన్ అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగానికి ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో, ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.













Click it and Unblock the Notifications
