రాజధాని అమరావతి పిటీషన్లపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ఇదే..!!
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన విచారణను వాయిదా వేసింది. ఈ నెల 28వ తేదీన మరోసారి విచారించనుంది. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్‌ను దాఖలు చేసింది. అదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ పిటీషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ విచారణకు స్వీకరించింది.
ఈ రెండు వాదనలపై ఇప్పటివరకు 35 పిటీషన్లు దాఖలయ్యాయి. రైతులు, ఇతర సంఘాల తరఫున దాఖలైన పిటీషన్లన్నింటినీ ఒకటిగా చేర్చి విచారణ చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించగా.. ఇప్పుడు దాన్ని పునఃసమీక్షించినట్లు తెలుస్తోంది. మళ్లీ విడివిడిగానే విచారణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందువల్లే ఇవ్వాళ్టి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
దీనితో పాటు ఇవ్వాళ 30కి పైగా పెండింగ్ కేసులను సుప్రీంకోర్టు విచారించింది. నిర్ణీత సమయానికి అమరావతి పిటీషన్లకు కేటాయించిన నంబర్ రాకపోవడం వల్ల తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసిందని సమాచారం. తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం- ప్రధానంగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

దీని తరువాత జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అత్యున్నత స్థాయి కమిటీ రూపొందించిన నివేదికల్లోని అంశాలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేస్తోంది. వాటినేవీ హైకోర్టు పట్టించుకోలేదని జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. వేర్వేరు సందర్భాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో చేసిన ప్రకటనలను కూడా దీనికి జోడించింది. రాజధాని నగరాలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ నిత్యానందరాయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్లను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
అధికార వికేంద్రీకరణ జరగాలంటూ పలు సంఘాలు ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లోని సారాంశాన్నికూడా క్లుప్తంగా సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నం చేస్తోంది. 2014-2019 మధ్యకాలంలో రాజధాని ప్రాంతం పరిధిలో జరిగిన నిర్మాణాలు, దాన్ని నిర్మించడానికే అయ్యే వ్యయం, రాష్ట్ర ఆర్థిక స్థితి వంటి అంశాలన్నీ ఈ విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications