అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీంకోర్టు నోటీసులు-రఘురామ పిటిషన్ పై వివరణ కోరుతూ
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ తో పాటు దర్యాప్తు సంస్ధ సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అసాధారణ జాప్యాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈ నోటీసులు పంపింది.
ఏపీలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్ తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. అలాగే ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇప్పటికే 3 వేల సార్లు వాయిదా వేసిందని కూడా పేర్కొన్నారు.

దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు జగన్ కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని అడిగింది. అలాగే జగన్ కేసుల్ని తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామ చేసిన విజ్ఞప్తినా స్పందించిన సుప్రీంకోర్టు.. రఘురామ బదిలీ పిటిషన్‍ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని కోరుతూ వైఎస్ జగన్ తో పాటు సీబీఐకీ నోటీసులు పంపింది.
అలాగే ఈ కేసులో ఇతర ప్రతివాదులకూ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి నెలకు వాయిదా వేసింది. అదే సమయంలో రఘురామ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ రఘురామను ఉద్దేశించి మీరు ఫిర్యాదుదారు కాదు, బాధితులు కాదు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే ఇది రాజకీయం కోసం వేసిన పిటిషన్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications