నవంబర్ 1న ఏం జరగబోతోంది ? ఏపీలో పరిణామాలకు టర్నింగ్ ! ఆ తర్వాతే కీలక నిర్ణయాలు !
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు విపక్షాల మద్దతున్న అమరావతి పాదయాత్ర, మరోవైపు అధికార వైసీపీ మూడు రాజధానుల సభలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాగుతున్న పరిణామాలకు ముగింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సుప్రీంకోర్టు విచారణ. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం, తీర్పు సరిగా అమలు కావడం లేదంటూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు నవంబర్ 1న సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం ప్రకటించనుంది.

అమరావతిపై హైకోర్టు తీర్పు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో అప్పటివరకూ మూడు రాజధానుల కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం పెట్టి హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. అయితే గతంలో ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లుల్ని మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మాత్రం సాహసించలేదు. ఆ తర్వాత మరోసారి మూడు రాజధానుల పోరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అమరావతి పాదయాత్ర
అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులు అరసవిల్లికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతివ్వకపోయినా హైకోర్టు అనుమతితో రైతులు కొనసాగిస్తున్నారు. అయితే మధ్యలో పాదయాత్రకు వైసీపీ శ్రేణులు నిరసనలు తెలియజేయడం విమర్శలకు తావిచ్చింది. చివరికి హైకోర్టు గతంలో విధించిన నిబంధనల మేరకే పాదయాత్ర చేయాలని చెప్పడంతో పోలీసులు ఆంక్షల్ని కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టారు. దీంతో మొత్తానికే పాదయాత్ర నిలిచిపోయింది.

సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్
మరోవైపు హైకోర్టు అమరావతి రాజధానిని అమలుచేయాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై త్వరగా విచారణ చేపట్టాలని కూడా కోరుతోంది. ఈ నేపథ్యంలో విచారణకు సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది. అదే సమయంలో రైతులు కూడా అమరావతి తీర్పు అమలు కావడం లేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రైతుల పిటిషన్ పైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఒకే రోజు విచారణ జరిపేందుకు సిద్ధమైంది.

నవంబర్ 1 టెన్షన్
అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం, తీర్పులో మరిన్ని అంశాలు చేర్చి అమలుచేసేలా చూడాలంటూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో నవంబర్ 1న ఈ రెండు పిటిషన్లపైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి పాదయాత్రతో పాటు వైసీపీ వికేంద్రీకరణ సభల్ని, ర్యాలీల్ని కూడా ఈ తీర్పు ప్రభావితం చేయబోతోంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఆ తర్వాత హైకోర్టు తన నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్దమవుతోంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజధానా, రాజధానులా అన్న విషయం కూడా తేలిపోనుంది. దీంతో సుప్రీంకోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆ తర్వాతే కీలక నిర్ణయాలు !
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత రాజధానులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వంతో పాటు విపక్షాలు కూడా సిద్దమవుతున్నాయి. అమరావతినే రాజధానిగా సుప్రీంకోర్టు కూడా ప్రకటిస్తే రైతుల పాదయాత్ర ప్రాధాన్యత లేకుండా పోతుంది. అలాగే విపక్షాలు అమరావతి కోసం ప్రత్యేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండదు. అటు ప్రభుత్వం కూడా మూడు రాజధానుల ప్రక్రియపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా మూడు రాజధానులకు మొగ్గు చూపితే మాత్రం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే సమయంలో అమరావతి రాజధాని కోసం చేసే పోరాటాలకు కూడా బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications