ఏకగ్రీవాలు, మున్సిపల్ ఎన్నికల కొనసాగింపు పై కొత్త టెన్షన్ - కీలక పరిణామాలు, నేడే నిర్ణయం..!?
మున్సిపల్ ఎన్నికలు.. ఏకగ్రీవాల నిర్ణయాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా. ఇప్పుడు ఇదే కొత్త టెన్షన్ కు కారణం అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్దులను నామినేషన్ల దాఖలు చేయకుండా అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరపనుంది. ఎన్నికల సంఘానికి చేసిన సూచనల అమలు.. వైసీపీ వాదనలు.. ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోర్టు ముందు ఉంచనున్నారు. దీంతో.. కోర్టు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
సుప్రీంకోర్టులో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల పైన కీలక విచారణ జరగనుంది. వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కీలక మార్గినిర్దేశం చేసింది. దీంతో.. గత విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే నివేదికలు ఈ విచారణలో కీలకం కానున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో ఈ నెల 28న జరగాల్సిన ఎన్నికల్ని నవంబరు 1కు మార్చారు. కోర్టు ఆదేశాల అమలుపై మంగళవారం నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసే నివేదికపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో ఏర్పడింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఈ నెల 14న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

సుప్రీం నేటి నిర్ణయం పై ఉత్కంఠ
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ 16 నుంచి 18 వరకు కొనసాగింది. అయితే తమ పార్టీ అభ్యర్థులను పలుచోట్ల నామినేషన్లు వేయనీకుండా అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 21న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులు, వాటికి సంబంధించిన పత్రాలు, వీడియో ఆధారాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. నామినేషన్లు వేయకుండా అడ్డంకులు ఎదురైనట్లు నిర్ధారణకు వచ్చిన చోట్ల గడువు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకున్నా.. వైసీపీ ఆ 19 మున్సిపాల్టీల్లో నామినేషన్లకు అవకాశం ఇవ్వలేదని..ఏకగ్రీవమని ప్రకటించిన అంశాన్ని కోర్టు ముందు వివరించేందుకు సిద్దమైంది. దీంతో.. వైసీపీ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, అవసరమైన చోట్ల గడువు పొడిగింపు వంటి అంశాలు విచారణలో కీలకం కానున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్‌పై తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ గా మారుతోంది.













Click it and Unblock the Notifications
