అన్నయ్యా.. ఎలా ఉన్నావు: జగన్ ను కలిసిన స్టార్ హీరోలు సూర్య, కార్తీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. సమీప బంధువుల వివాహ వేడుకలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రే ఆయన చెన్నైకి చేరుకున్నారు. చెన్నైలో కూడా జగన్ హవా కనిపించింది. ఆయనను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్ బస చేసిన చెన్నై ఇళంబాక్కం సమీపంలోని వీజీపీ లేఅవుట్ లో ఉన్న అనిల్ రెడ్డి నివాసం వద్ద సందడి నెలకొంది. జై జగన్ అంటూ నినదించారు. జగన్ ప్లకార్డులను సైతం ప్రదర్శించారు.
జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుక ఇది. అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్ ఒకింటి వాడవుతున్నాడు. వేదికను పెళ్లాడుతున్నాడు. ఈ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్ ఒక రోజు ముందుగానే చెన్నై చేరుకున్నారు. వైఎస్ జగన్ వచ్చారనే సమాచారంతో తెలిసిన వెంటనే చెన్నెలో నివసిస్తున్న తెలుగు వారు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఇళంబాక్కం నివాసానికి చేరుకున్నారు. తనను కలవడానికి వచ్చిన అభిమానులను జగన్ నిరాశపర్చలేదు. చిరునవ్వుతో వారికి అభివాదం చేశారు.

ఇదే వివాహానికి తమిళ హీరోలు సూర్య, కార్తీ హాజరయ్యారు. పెళ్లి మండపంలో ముందు వరుసలో ఆసీనుడై ఉన్న జగన్ ను చూడగానే వాళ్లిద్దరూ ఆప్యాయంగా పలకరించారు. వారి రాకను గమనించిన జగన్ లేచి, వారికి ఎదురు వెళ్లారు. ఆలింగనం చేసుకున్నారు. పట్టు పంచె, షర్ట్ ధరించిన సూర్య.. తొలుత జగన్ ను పలకరించారు. ఆ తర్వాత తన తమ్ముడు, స్టార్ హీరో కార్తీ గురించి జగన్ కు పరిచయం చేశారు. కొద్దిసేపు జగన్ తో వారిద్దరూ సరదాగా మాట్లాడటం కనిపించింది.
జగన్- సూర్య చాలాకాలంగా స్నేహితులు. దాన్ని ఇద్దరూ కొనసాగిస్తూ వస్తోన్నారు. కుటుంబాల పరంగా కూడా వారి మధ్య స్నేహసంబంధాలు ఉన్నాయి. దాని కారణంగానే వైఎస్ అనిల్ రెడ్డి.. సూర్య, కార్తీని ఈ వివాహానికి ఆహ్వానించారు. జగన్ కు చెందిన కొన్ని సంస్థల్లో సూర్య పెట్టుబడులు పెట్టాడనే వార్తలు ఇదివరకు వినిపించిన విషయం తెలిసిందే. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనను ఎంతగానో అభిమానిస్తానని సూర్య బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications