తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 77,092 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,615 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.55 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
ఆ ఒక్క రోజే మొత్తం 4.19 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 1.81 లక్షలమంది భక్తులు శ్రీనివాసుడి అన్నప్రసాదాలను స్వీకరించారు. కాగా.. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో గురువారం ఆయుధ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొన్నారు.

ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలు, ఇతర పరికరాలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు అన్నప్రసాద సేవ కూడా ముఖ్య భాగమని పేర్కొన్నారు.
గత రెండేళ్లలో అన్నప్రసాద ట్రస్ట్ కు సుమారు 1,100 కోట్ల రూపాయల మేర విరాళాలు అందాయని వివరించారు. టీటీడీకి అందిన మొత్తం విరాళాల్లో 53 శాతానికి పైగా అన్నప్రసాద ట్రస్టుకే లభించాయని, ప్రస్తుతం అన్నప్రసాద ట్రస్ట్ నిధులు సుమారు 3,100 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని అన్నారు. తిరుమలలో సాధారణ రోజుల్లో మూడు లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తుంటామని, బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య నాలుగున్నర లక్షలకు దాటుతుందని చెప్పారు.
ఒక్కరోజులో ఇన్ని లక్షలమంది భక్తులకు అన్నప్రసాదం అందించడానికి శ్రీవారి కృపా కటాక్షాలే కారణమని వెంకయ్య చౌదరి అన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 90 వేల నుంచి లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 1985లో 2,000 మందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతోందని, రాబోయే రోజుల్లో టీటీడీ పరిధిలోని 65 దేవాలయాల్లోనూ అన్నప్రసాద వితరణ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు.














Click it and Unblock the Notifications
