స్వాతిరెడ్డి ట్రోలింగ్ ఎఫెక్ట్ : చంద్రబాబుకు మరో కొత్త పేరు పెట్టిన సాయిరెడ్డి...!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ, టీడీపీ మధ్య వార్ ముదురుతోంది. ఇది బహిరంగ విమర్శలకు పరిమితం కావడం లేదు. సోషల్ మీడియాలో అంతకు మించి పరస్పరం ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో స్వాతిరెడ్డి పేరుతో ఓ ఖాతా నుంచి వస్తున్న ట్రోల్స్ వైసీపీని విసిగిస్తున్నాయి. దీనిపై తాజాగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. ఇదే వ్యవహారంపై ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరింత ఘాటుగా స్పందించారు.
విదేశాల నుంచి శ్వేతా చౌదరి అనే టీడీపీ సానుభూతిపరురాలు స్వాతిరెడ్డి పేరుతో ఈ ట్రోల్స్ చేస్తోందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీటిపై టీడీపీ స్పందించకపోవడంతో ఇవాళ దానికి కొనసాగింపుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు. ఇందులో ఎప్పటిలాగే చంద్రబాబును టార్గెట్ చేయడంతో పాటు ఆయనకు మరో కొత్త పేరు కూడా పెట్టారు. దీంతో ఇప్పుడు సాయరెడ్డి ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.

సాయిరెడ్డి తన ట్వీట్ లో టీడీపీతో పాటు చంద్రబాబును కూడా టార్గెట్ చేశారు. మధ్యలో స్వాతిరెడ్డి ప్రస్తావన కూడా చేశారు. స్వాతి చౌదరికి రెడ్డి పేరు పెట్టి నీచ యుద్ధం చేసే బదులు.. మీకో, మీ కొడుకు పేరుకే రెడ్డి తగిలించుకోవచ్చు కదా బాబూ అంటూ సాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. తద్వారా స్వాతి చౌదరికి రెడ్డి పేరు తగిలించుకోవడం ఎందుకని వైసీపీ ఎంపీ ఆయన్ను ప్రశ్నించారు. అలాగే మరో ట్వీట్ కూడా చేశారు.

ఇందులో అబద్ధాలకు మారు పేరైన బాబు.. ఇప్పుడు ఆశ్లీల రాజకీయానికి కూడా కేరాఫ్ అడ్రస్ గా మారాడంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక మీదట ఈయన పేరు కోట స్వాతిముత్యం చౌదరి అన్నారు. తద్వారా స్వాతి రెడ్డి వ్యవహారాన్ని పూర్తిగా చంద్రబాబుపైకి మళ్లించారు. తద్వారా తమను నేరుగా టార్గెట్ చేయకుండా మారుపేర్లతో టార్గెట్ చేయడం ఎందుకనేది సాయిరెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications