175 నియోజకవర్గాల్లో ఇదొక్కటే ''రారాజు!?''
ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు లేని ప్రత్యేకతను కొత్తగా ఆపాదించారు. 174 నియోజకవర్గాల రాజకీయం ఒక ఎత్తయితే ఈ ఒక్క నియోజకవర్గ రాజకీయం మరో ఎత్తు. తన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఈ నియోజకవర్గం కొరకరాని కొయ్యగా మారింది.

మొదటిగా వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేగా..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేల్లో మొదటిగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది ఎవరయ్యా? అంటే రాజధాని పరిధిలోని తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అని చెప్పవచ్చు. చెప్పడమేకాదు.. సొంత పార్టీ వర్గాలు కూడా అదే మాటంటున్నాయి. ఈ నియోజకవర్గంలో కొత్తకాలంగా చోటుచేసుకున్న ట్విస్టులను ఎవరూ ఊహించి ఉండరు. ప్రజలతో మమేకమవండంటూ ముఖ్యమంత్రి ఒకవైపు గొంతు చించుకొని చెబుతుంటే.. ఇక్కడి ఎమ్మెల్యే ఆ ప్రజల నుంచే భారీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేయడంతోపాటు మరికొన్ని వివాదాలు శ్రీదేవికి గుదిబండగా మారాయి. ఉండవల్లి శ్రీదేవికి ఈసారి ఎన్నికల్లో సీటిస్తే ఓడిపోవడం పక్కా అంటూ సర్వే సంస్థలు కూడా ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చాయి.

ఇక్కడ విజయం సాధిస్తేనే!
దీంతో రాష్ట్రంలోని మిగతా అన్ని నియోజకవర్గాలకన్నా ఈ నియోజకవర్గంపైనే ముఖ్యమంత్రి జగన్ దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే ప్రభుత్వం మూడు రాజధానులుఅంటోంది.. ఇదేమో అమరావతి రాజధాని నియోజకవర్గ పరిధిలో ఉంది. ఎలాగైనా ఈసారి ఇక్కడ కూడా విజయం సాధించి రాష్ట్రంలోని ప్రజలంతా మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారనే సందేశాన్ని పంపించాలనే పట్టుదలతో సీఎం ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితులన్నీ తాను అనుకున్న రీతిలో లేకపోవడంతో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావును అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఆ తర్వాత నియోజకవర్గంలో గొడవలు ఎక్కువయ్యాయి. డొక్కా వర్గం వర్సెస్ ఉండవల్లి వర్గంతో విభేదాలు రచ్చకెక్కాయి.

అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి..
అధిష్టానం మాటను కూడా ఇద్దరు నేతలు పెడచెవిన పెట్టారు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. డొక్కా నియామకం సమయంలో ఉండవల్లి శ్రీదేవి వర్గం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మేకతోటి సుచరిత ఇంటిముందు ధర్నా చేశాయి. తర్వాత ఎన్నికల్లో శ్రీదేవికి సీటు లేదనే విషయం ఖారారై పార్టీలో ప్రచారం జరగసాగింది. దీంతో ఈ నియోజకవర్గం విషయంలో ముఖ్యమంత్రి జగన్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గానికి పార్టీ అదనపు సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్ ను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆయన సతీమణి కత్తెర క్రిస్టీనా గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఎమ్మెల్సీ డొక్కాను గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించి, మేకతోటి సుచరితను తప్పించారు. డొక్కా స్థానంలోకి కత్తెర వచ్చారు. మలుపులుమీద మలుపులు తిరుగుతున్న ఈ నియోజకవర్గ రాజకీయం చివరకు ఏ దరికి చేరుతుందో అర్థం కాకుండా ఉందని సీనియర్ రాజకీవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications