టాక్ ఆఫ్ ద టౌన్: రాజమౌళి బాహుబలి, పవన్ కళ్యాణ్ ట్విట్టర్
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అంటే ఎవరూ విభేదించకపోవచ్చు. ఆయన వరుస హిట్ సినిమాలు ఆయనకు ఎనలేని క్రేజ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. అన్నయ్య చిరంజీవి నీడ నుంచి ఆయన తప్పుకున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఆయనపై తన అన్నయ్య చిరంజీవి ముద్ర లేకుండా చేసుకున్నారు. రాజకీయాల్లో ఆయన ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.
మరోవైపు, ప్రస్తుత తెలుగు దర్శకుల్లో రాజమౌళికి ఉన్న క్రేజ్ మరొకరికి లేకపోవచ్చు. దాసరి నారాయణ రావు, బాలచందర్, రాఘవేంద్ర రావు వంటివారికి గతంలో ఉన్న క్రేజ్‌ను వర్తమానంలో రాజమౌళి కొట్టేశారు. బాహుబలి సినిమాతో ఆ క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. సినిమా వస్తే ప్రేక్షకులు ఎక్కువగా హీరో గురించే మాట్లాడుకుంటారు. కానీ, ఇప్పుడు దర్శకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ వంటి మాస్ హీరో బాహుబలి సినిమాలో ఉన్నప్పటికీ రాజమౌళి గురించే అందరూ చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా వైపు నుంచి కాకుండా రాజకీయాల వైపు నుంచి టాపిక్‌గా మారిపోయారు. మీడియా సమావేశం పెట్టి ప్రస్తుత రాజకీయాలపై, వాటి పరిణామాలపై ఆయన మాట్లాడిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర చర్చ చెలరేగింది. ఆ చర్చ ఇంకా కొనసాగుతోంది. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలకు ఆయన మాటలు రుచించలేదు. దీంతో పవన్ కళ్యాణ్‌పై వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తనపై వచ్చిన విమర్శలకు పవన్ కళ్యాణ్ దీటుగా ప్రతిస్పందించారు. ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని ఆయన తనపై విమర్శలకు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. సమాధానాలు అనడం కన్నా మరిన్ని ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. ఆయన ట్విట్టర్ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.
రాజమౌళి బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అమితాబ్ వంటి హిందీ సినీ ప్రముఖులు కూడా నీరాజనాలు పడుతున్నారు. సాంకేతికంగా, కథాపరంగా అది హాలీవుడ్ సినిమా స్థాయికి తెలుగు సినిమాను చేర్చారని రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో అటు పవన్ కళ్యాణ్, ఇటు రాజమౌళి చర్చనీయాంశంగా మారారు. వారిపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications