రోశయ్య సలహా బాగుంది: కానీ ఇద్దరు 'చంద్రులు' వింటారా?
హైదరాబాద్: సమైక్య ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చాలా రోజులు తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాట్లాడారు. రోశయ్య స్వస్థలమైన గుంటూరులోని వేమూరుకి బుధవారం వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు ఒకరినొకరు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. భవిష్యత్ దృష్ట్యా ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసికట్టుగా మెలగాలని సూచించారు. రాష్ట్ర విభజన కారణంగా కొత్త సమస్యలు ఎదుర్కొంటున్న రెండు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయమార్గాలను పెంచుకొనే ప్రయత్నాలు చేస్తూనే ప్రజలపై ఆ భారం మోపకుండా పరిపాలన సాగించాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆదాయం బయటకు పోకుండా కట్టడి చేయాలని సూచించారు. జాతీయస్థాయి గవర్నర్ల సదస్సు జరిగినప్పుడు తాను రెండు తెలుగు రాష్ట్రాల కోసం కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తానని చెప్పారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రిగా రోశయ్య పనిచేశారు. 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆ శాఖను చాలా చక్కగా నిర్వహించిన మంత్రిగా దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు వరుసగా 7 సార్లు ఒక రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి రోశయ్యే.

మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డి లాంటి హేమాహేమీల ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి చాలా చెడ్డపేరు మూట గట్టుకొన్నారు.
చివరికు రాష్ట్రాన్ని పాలించడం తనవల్ల కాదని చేతులు ఎత్తేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని తనకు తానుగా వదులుకొన్న మొట్టమొదటి వ్యక్తి రోశయ్యే కావొచ్చు.
అయితే ఆర్ధిక విషయాలపై ఆయనకున్న అవగాహన, పట్టుని ఎవరూ ప్రశ్నించలేరు. కనుక ఆ విషయంలో ఆయన చెపుతున్న సలహాలను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వీకరిస్తే బాగుంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా స్వీకరిస్తాని ఆశించడం రోశయ్య తప్పే అవుతుంది.
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య నివురు కప్పిన నిప్పులా ఉంది. అది ఏ క్షణమైనా బయటపడొచ్చు. వాస్తవానికి ఇరువురికీ ఒకరిపట్ల మరొకరికి గౌరవం లేదనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారిద్దరి ప్రవర్తన అదే తీరుగా ఉంది.
అంతేకాదు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఒకరికొకరు సహకరించుకోవాలనే ఆసక్తి కూడా కనిపించడం లేదు. ఎవరికి వారు తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని అనుకొంటున్నారే తప్ప కలిసి అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన లేదు.












Click it and Unblock the Notifications