తారకరత్న ఆరోగ్యం మరింత విషమం- విదేశాలకు తరలింపు..?!
తీవ్ర గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బెంగళూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యాధునిక చికిత్సను అందిస్తోన్నారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ..
నందమూరి కుటుంబం మొత్తం ప్రస్తుతం నారాయణ హృదయాలయా ఆసుపత్రిలోనే ఉంటోన్నారు. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. తారక్ కు అందుతోన్న వైద్య సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. ఆయనను చూడ్డానికి హైదరాబాద్ నుంచి పలువురు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు బెంగళూరుకు వస్తోన్నారు.

సినీ పెద్దలతో పాటు..
ప్రముఖ నటులు, తారకరత్న సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, శాండల్ వుడ్ సూపర్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, మంచు మనోజ్.. తదితరులు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అటు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ కూడా తారకరత్న ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నారు.

వెంటిలేటర్ పైనే..
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందంటూ ఆయన కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారు. ఎక్మో సపోర్ట్ తో తారక్ కు వైద్యాన్ని అందిస్తోన్నారంటూ వచ్చిన వార్తలను నందమూరి రామకృష్ణ కొట్టి పారేశారు. అలాంటిదేమీ లేదని చెప్పారు. డాక్టర్లు అందించే వైద్యానికి ఆయన శరీరం సహకరిస్తోందని అన్నారు. పూర్తిస్థాయిలో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తారకరత్నకు ఇంకా వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తోన్నారని వివరించారు.

విదేశాలకు తరలించే యోచనలో..
తాజాగా మెదడు సంబంధిత ఇబ్బందులకు గురైన తారకరత్నకు మరింత మెరుగైన చికిత్సను అందించడానికి ఏర్పాట్లు చేస్తోన్నట్లు హిందూపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ చెప్పారు. ఇవ్వాళ ఆయన ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. ఆయన మెదడుకు స్కాన్ తీశారని, రిపోర్టులను బట్టి విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని అన్నారు. మెదడులో నీరు చేరిందని, కొద్దిగా వాపు కనిపించిందని అన్నారు.

బాలయ్య హోమం..
ప్రస్తుతం తారకరత్నకు వెంటిలేటర్ పైనే ఇంకా చికిత్స కొనసాగిస్తున్నారని అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన కోలుకోవడానికి సమయం పట్టొచ్చని చెప్పారు. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా తారక్ మళ్లీ తమ ముందుకు వస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అభిమానులందరూ ఆయన కోసం పూజలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, అభిమానులు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారని, ఆసుపత్రి ప్రాంగణంలో తమ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మృత్యుంజయ హోమం చేపట్టారని లక్ష్మీనారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications