సీఎం జగన్ మిషన్ 2024 : ప్లీనరీ వేదికగా -ప్రశాంత్ కిషోర్ సహా : ఎన్నికల సమరశంఖం..!!
ముఖ్యమంత్రి జగన్ మిషన్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సమాయత్తం అవుతున్నారు. అందు కోసం పార్టీ ప్లనరీని వేదికగా మలచుకుంటున్నారు. ఈ ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహణకు నిర్ణయించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న వైసీపీ ప్లీనరీని నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2017లో చివరి సారిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద పార్టీ ప్లీనరీ నిర్వహించారు.
ఆ సమావేశాలకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా షర్మిల సైతం హాజరయ్యారు. అదే వేదికగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను జగన్ పార్టీ నేతలు - కేడర్ కు ఓపెన్ గా పరిచయం చేసారు. ఆ తరువాత 219 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ ప్లీనరీ నిర్వహించ లేదు.

అయిదేళ్ల తరువాత పార్టీ ప్లీనరీ
కరోనా కారణంగా ఆ ఆలోచన చేయలేదు. అదే విధంగా సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ పరంగా నిర్వహించిన చెప్పుకోదగిన కార్యక్రమాలు లేవు. పార్టీకి - జగన్ కు మధ్య సమన్వయకర్తలే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. వరుసగా జరిగిన అన్ని ఎన్నిక ల్లోనూ మంత్రులు..ఎమ్మెల్యేలే గెలుపు బాధ్యతలను తమ భుజ స్కందాల పైన వేసుకున్నారు.
అయితే, సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ పార్టీ పైన ఫోకస్ పెట్టకుంటే ఎన్నికల నాటికి పట్టాలెక్కించటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాలు అన్నింటికీ సీఎం జగన్ లక్ష్యంగా మారారు. ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. దీంతో..సీఎం జగన్ 2024 ఎన్నికల కోసం కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా
జూలై 7,8 తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. అదే సమయంలో కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా.. పార్టీలోనూ మార్పులు చేర్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీ సైతం పూర్తి చేసి ప్లీనరీ వేదికగా ఇక ఎన్నికల సమరంలోకి దిగాలనేది ఆలోచనగా తెలుస్తోంది.
ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ టీం ఈ ఏడాది మార్చి తరువాత రంగంలోకి దిగుతుందని కొద్ది నెలల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఈ ప్లీనరీ సమావేశాల్లో ప్రశాంత్ కిషోర్ సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశం లేదా విశాఖ నగరాన ప్లీనరీ నిర్వహణ పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రశాంత్ కిషోర్ సైతం హాజరవుతారంటూ
మే 27,28 తేదీల్లో టీడీపీ సైతం మహానాడు - ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వచ్చే ఎన్నికలకు కార్యాచరణ డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో తీసుకొనే నిర్ణయాలకు ధీటుగా ప్లీనరీ వేదికగా వైసీపీ సైతం తమ ఎన్నికల సమరం ప్రారంభించనుంది. పాలనా పరంగా ప్రజల్లో ఉన్న ఫీడ్ బ్యాక్ ను సీఎం జగన్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా మంత్రులు..ఎమ్మెల్యేల పైన ప్రజాభిప్రాయం సైతం సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు.

సమరశంఖం పూరించనున్న జగన్
సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతున్నా.. పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అయితే, జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకొనే మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉంది. దీంతో..ఈ సారి వైసీపీ ప్లీనరీ ద్వారా సీఎం జగన్ మరోసారి మిషన్ 2024 ను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం మీద జరుగుతున్న ప్రచారానికి అసెంబ్లీ ద్వారా.. పార్టీ వ్యవహారాలు - భవిష్యత్ కార్యాచరణ గురించి ప్లీనరీ ద్వారా స్పష్టత ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications